
'కామారెడ్డిని జిల్లాగా మార్చుతాం'
బాన్సువాడః జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కామారెడ్డిని జిల్లాగా మార్చి.. దాని పరిధిలో బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలను చేర్చుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ రెవెన్యూ డివిజన్ అవుతుందని, నిజామాబాద్ జిల్లా పరిధిలో బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు ఉంటాయని తెలిపారు. బుధవారం బాన్సువాడలో రూ.7కోట్లతో ఆయన రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పోచారం మాట్లాడుతూ.. జిల్లా ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్ తో కలిసి త్వరలో ఢిల్లీకు వెళ్ళి, బోధన్-బీదర్ రైల్వే లైన్ మంజూరీ కోసం ప్రయత్నిస్తామని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 'గ్రామజ్యోతి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, ఈ నెల 17 నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమంలో మొదట గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపైనే దృష్టి సారిస్తామని అన్నారు. పారిశుధ్య కార్మిక నాయకులతో సీఎం చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే వారి సమ్మెకు ముగింపు పలికి, గ్రామ జ్యోతిలో పాల్గొనేటట్లు చేస్తామని అన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు కలిసి గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. నియోజకవర్గ నిధులతో బాన్సువాడలో ప్రతీ ఒక్క ఇంటికి ఒక డస్ట్‌బిన్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. బాన్సువాడ నుంచి ఎక్స్‌రోడ్డు వరకు రూ.25కోట్లతో రోడ్డును వెడల్పు చేస్తున్నామని, అటవీ ప్రాంతమైన మొండిసడక్ వరకు రోడ్డు మలుపులను తొలగించేందుకు రూ.10కోట్లు మంజూరు చేయించామని తెలిపారు.