విభజన లెక్కలు వేగవంతం | Division calculations Speed | Sakshi
Sakshi News home page

విభజన లెక్కలు వేగవంతం

Published Mon, May 5 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

Division calculations  Speed

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో విభజన లెక్కలు వేగవంతమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో లెక్కల విభజన ఈ నెల 24తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పరిధిలో ఉన్న చెల్లింపులన్నీ 24వ తేదీతో పూర్తి కానున్నాయి. ప్రభుత్వశాఖల పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఇతరత్రా అన్ని చెల్లింపులు అదేరోజు తెగదెంపులు కానున్నాయి. దీనికోసం అధికారులు లెక్కలు సిద్ధం చేయడంలో మునిగి తేలుతున్నారు. చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లను ట్రెజరీశాఖలో అధికారులు పూర్తి చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం ప్రత్యేక రాష్ట్ర పరిధిలోకి రానున్నాయి.
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా విభజన లెక్కలు వేగవంతమయ్యాయి. మే 24 తర్వాత నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేటికవేనంటూ జిల్లా ట్రెజరీ శాఖకు ముందస్తుగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పింఛన్‌దారులకు నిర్ణీత సమయానికి వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఉద్యోగు లకు, పెన్షనర్లకు 24నే వేతనాలు
 అందించనున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించనుండడంతో 24న తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్‌లో చివరిది కానుంది. జిల్లాలో మొత్తం 29,584 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు.
 
 మంథని డివిజన్‌లో 1,736, పెద్దపెల్లిలో 4,119, జగిత్యాలలో 5,892, సిరిసిల్లలో 3,651, కరీంనగర్‌లో 14,178 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 19,796 మంది పెన్షనర్లు ఉన్నారు. ప్రభుత్వ వేతనం కింద ఉద్యోగులకు రూ.47.85 కోట్లు, పెన్షనర్లకు రూ.34.34 కోట్లు చెల్లించాలి. ఈ మేరకు జీవో విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న ట్రెజరీశాఖ ఉద్యోగుల జాబితా, బ్యాంకు ఖాతాలను సిద్ధం చేస్తోంది.  జిల్లాలోని పింఛన్‌దారులకు కూడా మే నెల చెల్లింపును ఈ నెల 24నే చేయనున్నారు.
 
 నిధులు సర్దుబాటయ్యేనా!
 ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖలకు ఖజానా శాఖ ద్వారా నిధులు విడుదలవుతాయి. ఉద్యోగుల జీతాల మాదిరిగానే నిధుల ఖర్చుకు కూడా ఈ నెల 24నే తుదిగడువుగా నిర్ణయించారు. ఆలోగా వెచ్చించని మొత్తాన్ని అప్పజెప్పాలంటూ ఆదేశాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావుడిలో ఉన్న అధికారులు నిధుల వినియోగం ఎలా? అని తలలు పట్టుకుంటున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు గత ఆర్థిక సంవత్సరం చివరి సమయంలో మంజూరయ్యాయి. జిల్లాలోని 1,200 గ్రామపంచాయతీలకు రూ.17 కోట్లు మంజూరుకాగా అన్నింటికీ కేటాయింపులు జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇప్పటివరకు పనులకు గ్రహణం ఏర్పడింది. 24లోగా ఈ ప్రక్రియ పూర్తికాకపోతే నిధుల పరిస్థితి ఏమిటన్నది ప్రశార్థకంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఈ లోగా ఖర్చు చేయకపోతే కష్టమే.
 
 కసరత్తు వేగవంతం..
 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏప్రిల్ 22న జీవో నంబర్ 86 ద్వారా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. వివిధ రకాల బిల్లులు, చెల్లింపులకు సంబంధించిన ఆదేశాలను ఈ నెల 15, 31 లోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 24న ఉద్యోగులకు జీతాలు, పింఛన్‌దారులకు పింఛన్ చెల్లిం పులకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. బిల్లులు వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను కోరాం.
 - వెంకన్నగౌడ్, జిల్లా ట్రెజరీశాఖ డీడీ
 
 ఉమ్మడి రాష్ట్రంతో విముక్తి
 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటాలు, అమరవీరుల ఆత్మత్యాగాల సాక్షిగా తెలంగాణ కల సాకారమయ్యింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్య్రం పొందిన అనుభూతిని పొందబోతున్నాం. ఈ నెల 24న సమైక్య రాష్ట్రంలో చివరి జీతం తీసుకోనున్నాం. దేశ చరిత్రలో నిలిచిపోయే జూన్ 2 కోసం ఎదురుచూస్తున్నాం.
 - ఎంఏ.హమీద్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement