
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య విద్యను మరింత పటిష్టం చేయడం, వైద్య విద్యలో కీలకమైన నర్సింగ్ బోధన, సేవలను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తరహాలోనే నర్సింగ్ విద్యను ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా నిర్వహించేందుకు.. నర్సింగ్ సేవల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ‘డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ (డీఎన్‌ఈ)’పేరిట కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. నర్సింగ్ విద్య పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకానుండడం దక్షిణ భారత దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఉన్న నర్సింగ్ విద్య వ్యవస్థను విడదీసి డీఎన్‌ఈలో చేర్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే డీఎన్‌ఈ కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం (2018–19) ప్రారంభమయ్యేలోపు డీఎన్‌ఈ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు సుమారు 356 విద్యా సంస్థలు దీని పరిధిలోకి రానున్నాయి.
ఈ సేవలు ఎంతో కీలకం
వైద్య వ్యవస్థలో నర్సింగ్ విభాగం చాలా కీలకమైనది. వైద్యులకు సమాంతరంగా నర్సింగ్ విభాగం సేవలు అందిస్తోంది. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యుల కోర్సులు, సిలబస్‌లలో మార్పులు జరుగుతున్నాయి. డీఎంఈ కూడా పూర్తిగా ఎంబీబీఎస్, బీడీఎస్ విద్య నిర్వహణపైనే దృష్టిపెట్టి.. నర్సింగ్ విద్య బలోపేతాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే నర్సింగ్ విద్య పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పటికే నర్సింగ్ విద్యను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. మన దేశంలోనూ ఒడిశా, మిజోరం రాష్ట్రాల్లో నర్సింగ్ డైరెక్టరేట్‌లు ఉన్నాయి. దేశంలో తొలిసారిగా ఒడిశా రాష్ట్రం నర్సింగ్ వ్యవస్థ బలోపేతం కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసింది. నర్సింగ్ విద్యకు సంబంధించిన అన్ని విద్యా సంస్థల పర్యవేక్షణను దానికి అప్పగించింది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ ‘డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ (డీఎన్‌ఈ)ను ఏర్పాటు చేయనున్నారు.
మారుతున్న అవసరాలకు అనుగుణంగా..
నర్సింగ్ వైద్య విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. దేశంలోనే మెరుగైన వ్యవస్థ ఉండేలా ప్రయత్నిస్తున్నాం. మారుతున్న అవసరాలకు తగినట్లుగా నర్సింగ్ విద్యను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది..
– డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి, డీఎంఈ
డీఎన్‌ఈ పరిధిలోకి 356 కాలేజీలు
ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుల నిర్వహణ ఇక ముందు డీఎన్‌ఈ పరిధిలోనే ఉండనుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ ఐదు కోర్సులను అందించే కాలేజీలు 356 ఉన్నాయి. ఏటా కొత్తగా ఐదు వేల మంది ఈ కోర్సులను అభ్యసిస్తున్నారు. మరోవైపు వైద్యారోగ్య శాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,900 మంది నర్సులు సేవలు అందిస్తున్నారు. డీఎంఈ, వీవీపీ, డీహెచ్ పరిధిలోని ఆస్పత్రుల్లో వారు పనిచేస్తున్నారు. ఇలా వేర్వేరు విభాగాల పరిధిలో ఉండడంతో నర్సుల సర్వీసు, పదోన్నతులు వంటి నిర్ణయాలు ఎవరి పరిధిలో ఉండాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీనివల్ల వైద్యారోగ్య శాఖలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎన్‌ఈ ఏర్పాటు చేస్తే.. నర్సింగ్ విద్యతోపాటు సర్వీసులో ఉన్న నర్సులకు శిక్షణ, వారి సేవల పర్యవేక్షణకు వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.