ఏడాదిలో 350 అబార్షన్లు చేసేశాడు..!
మహబూబాబాద్: ఆడశిశువుల పాలిట మృత్యువుగా మారిన కురవి డాక్టర్ శ్రీనివాస్ దారుణాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా అబార్షన్లకు పాల్పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. లింగ నిర్ధారణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి గర్భిణులు వస్తున్నా ఇక్కడి అధికారులకు మాత్రం విషయం తెలియలేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే కురవిలో డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తుంటే తమ వాటా తాము తీసుకొని చూసీచూడనట్లు వదిలేశారు.
మానుకోట ఎస్పీ కోటి రెడ్డి మంగళవారం స్ట్రింగ్ ఆపరేషన్ అనంతరం శ్వేత నర్సింగ్‌హోం నిర్వాహకుడు డాక్టర్ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడిని విచారించగా తాను రోజుకు ఐదుగురి నుంచి ఆరుగురికి స్కానింగ్ చేస్తే వారిలో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆడశిశువు అని తేలేదని, విషయం పేషెంట్‌కు చెబితే, ఇప్పటికే తమకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల వద్దు తీసేయండని చెప్పేవారని పోలీసుల ఎదుట వెల్లడించినట్లు తెలిసింది. ఇలా రోజుకు ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆడశిశువుల పిండాలను తొలగించానని, ఈ ఏడాది 350 పైగానే ఆడశిశువుల పిండాలను తొలగించానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం.
శ్రీనివాస్ చెప్పిన నిజాలతో కంగుతిన్న పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోని స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.