అమ్మో.. ‘ఆపరేషన్’!
ఆపరేషన్ అంటే ఎంత గుండె నిబ్బరం గల రోగికైనా భయమే. ఎంతటి వారికైనా గుండె దడ సహజమే. అయితే.. పేషెంట్‌లాగే కొందరు వైద్యాధికారులు సైతం అదంటేనే భయంతో వణుకుతున్నారు. వైద్యాధికారులు ఏమిటి.. వారికి ఆపరేషన్ ఏమిటి.. అనుకుంటున్నారా..?. అవును.. వారు నిజంగానే ఆపరేషన్‌ను ఎదుర్కోబోతున్నారు. అది అట్లాంటిది.. ఇట్లాంటిది కాదు. సర్కారు చీల్చిచెందాడేది. ఇంకా అర్థం కాలేదా..? అయితే.. చదవండి.
ఖమ్మం వైరారోడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ‘ఆపరేషన్’ చేపట్టింది. వైద్యారోగ్య శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించింది. అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర డెరైక్టర్‌పై వేటు వేయడంతోపాటు ఆ శాఖలో జరుగుతున్న అవినీతిపై జిల్లాల వారీగా నిఘా పెట్టిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైద్యారోగ్య శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటి దాకా అందిన కాడికి దోచుకున్న కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణ చేపడితే తామెక్కడ దొరికిపోతామోనని భయంతో వణికిపోతున్నారు.
వివాదాల పుట్ట.. డీఎంహెచ్‌ఓ కార్యాలయం
ఖమ్మం డీఎంహెచ్‌ఓలో అవినీతి తాండవిస్తోందనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధుల దుర్వినియోగం, 104లో డిప్యుటేషన్లు, కాంట్రాక్ట్ నియామకాలు, వాహనాల రిపేర్లు తదితర విషయాల్లో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఏఓ నాగార్జునను సంప్రదించకుండా డీఎంహెచ్‌ఓ భానుప్రకాశ్ నేరుగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం వివాదం సద్దుమణిగింది.
‘అనారోగ్య’మిషన్!
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు ప్రతి మూడు నెలలకోసారి లక్షల్లోనూ ఒక్కోసారి కోట్లలోనూ నిధులు వస్తుంటాయి. వాటిని జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు వెచ్చిస్తుంటారు. అయితే.. ఈ బాధ్యతను డీపీఎం నిర్వర్తించాల్సి ఉండగా డీఎంహెచ్‌ఓ నేరుగా చూస్తుండటం చర్చనీయాంశమైంది. ఈక్రమంలో ఈ నిధుల్లో భారీగానే అవినీతి చోటుచేసుకుంటోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
నియామకాల్లోనూ అంతే..
‘104’లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇటీవల 20 మందిని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కూడా లేకుండా నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఏఓ, డీఎంహెచ్‌ఓ మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ లేని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తనకు జీతం చెల్లించే విషయంలో ఏఓ వేధిస్తున్నారంటూ ఘర్షణ పడిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఏఓకు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు అండగా నిలిచారు. డీఎంహెచ్‌ఓ ప్రవర్తన కారణంగానే ఏఓ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఓను సంప్రదించకుండా నియామకాలు చేపట్టడంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ విషయం కలెక్టర్ వద్దకు కూడా వెళ్లింది. ఇదిలా ఉండగా వైద్యారోగ్య శాఖలో డిప్యూటేషన్లలో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అవసరం లేని చోట ఇద్దరు, ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా హెల్త్ అసిస్టెంట్ల నియామకంలోనూ అవినీతి చోటుచేసుకుందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.
వాహనాల రిపేర్ల పేరుతో దోపిడీ
జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన వాహనాలతోపాటు 104, 108 వాహనాలు తరచూ రిపేర్లకు వస్తుంటాయి. వాటికి సంబంధించిన బిల్లులు డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి చెల్లిస్తుంటారు. వాటిలోనూ భారీగా కుంభకోణం చోటుచేసుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రిపేర్లకు ఎక్కువ ఖర్చయినట్లు బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది.