సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి పట్టణ శివారులోని గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్‌ఆర్‌ఎస్ వద్ద ఉన్న దర్గాలో మంత్రి ప్రార్ధనలు చేశారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన ఫలహార శాలను డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను పద్మాదేవేందర్‌రెడ్డి, హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిలో అందిస్తున్న ైవె ద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, వైద్య విధాన పరిషత్ ఇన్‌చార్జి కమిషనర్ డాక్టర్ వీణాకుమారి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పద్మ, ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి సేవలపై రోగుల ఫిర్యాదు
మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రిని పరిశీలిస్తున్న సమయంలో రోగులు ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో డ బ్బులు ఇవ్వనిదే వైద్యం చేయడం లేదన్నారు. మంగళవారం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. ఈ క్రమంలో మెటర్నిటీ వార్డులోని మహిళా రోగులు ప్రసవం కోసం వస్తే వైద్య సిబ్బంది డ బ్బులు డిమాండ్ చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. రోగులకు అవసరమైన మందులను బయటి నుంచే తెచ్చుకోవాలని చెబుతున్నారన్నారు.
డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రి విషయంలో ఇకపై ఫిర్యాదులు రాకుండా చూడాలని ప్రత్యేకంగా ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేసి బాక్స్‌పై సూపరింటెండెంట్ ఫోన్ నెంబర్ రాసి ఉంచాలని సూచించారు. ఆసుపత్రి వెనకాల పిచ్చిమొక్కలు పెరగడం వాటిని తొలగించకపోవడంతో ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
కాసులు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నారు
Published Tue, Jun 17 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement
Advertisement