గర్భంలోనే శిశువుకు కత్తిగాట్లు
మృతశిశువు ప్రసవం; తల్లీ మృత్యువాత
- వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆరోపణ
- చిన్న ఆపరేషన్ చేసి ప్రసవం చేసే ప్రయత్నం
- పరికరాలతో తలపట్టి లాగిన వైనం
కరీంనగర్ హెల్త్: ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ తల్లిగర్భంలోనే కత్తిగాట్లతో చనిపోయింది. ఆ తర్వాత తల్లి కూడా చనిపోయింది. ప్రసవ సమయంలో చిన్న ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే ప్రయత్నంలో వైద్య పరికరాలతో తలను పట్టుకొని లాగడం వల్లే గాయాలై చనిపోయినట్లు భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం బొమ్మెనకు చెందిన బట్టు పద్మ(24) పురిటినొప్పులతో మంగళవారం ఉదయం చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకు అక్కడి సిబ్బందిని, వైద్యులను బతిమిలాడినా.. అక్కడ ప్రసవాలు చేయడం కుదరదంటూ వెళ్లగొట్టారు. ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు.
ఉదయం నుండి నొప్పులతో బాధపడుతోందని తెలిపినా పట్టించుకోకుండా సిబ్బంది చిన్న ఆపరేషన్ ద్వారా ప్రసవం చేయడానికి ప్రయత్నించారు. రాత్రి 9 గంటల సమయంలో చిన్న ఆపరేషన్ చేసి శిశువును బయటకుS తీసే ప్రయత్నం చేశారు. శిశువు బయటకు రాకపోవడంతో పరికరాలతో తలను పట్టుకొని బయటకులాగారు. ప్రసవం కాకపోగా రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించింది. రాత్రి ఒంటిగంట సమయంలో చిన్న ఆపరేషన్‌కు కుట్లువేసి బాధితురాలిని కరీంనగర్‌కు ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పినట్లు బంధువులు అంటున్నారు. కరీంనగర్ ఆస్పత్రికి తీసుకువచ్చిన తర్వాత ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే వైద్య సేవలు అందించారు. ఉదయం 8 గంటలకు పెద్ద ఆపరేషన్ చేయగా, కడుపులోనే మరణించిన మగ శిశువును ప్రసవించింది. ప్రసవించిన మృత శిశువు తలపై కత్తితో కొట్టినట్లుగా పెద్ద గాటు కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఆశ్చర్యపోయి బంధువులకు చూపించారు. కాగా, పద్మను ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందించారు. బుధవారం రాత్రి ఆమె కూడా చనిపోయింది.
ఆస్పత్రికి వచ్చే సరికే చనిపోయి ఉంది..
మంచిర్యాల: గర్భిణి బట్టు పద్మ ఆస్పత్రికి వచ్చే సరికే బిడ్డ చనిపోయి ఉందని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్‌రావు చెప్పారు. ఆమె మంగళవారం పురిటినొప్పులతో చెన్నూరు ఆస్పత్రికి వెళ్లారని, అక్కడి నుంచి తమ ఆస్పత్రికి వచ్చారని వివరించారు. అయితే, అప్పటికే ఆమెకు రక్తం తక్కువగా ఉందని, ఆమె అనీమియా పేషెంట్ కావడంతో రక్తం 4 గ్రాముల వరకే ఉందన్నారు. రక్తం ఎక్కించుకోవాలని చెప్పినా వినలేదన్నారు. తమ ఆస్పత్రికి వచ్చేలోగానే బిడ్డ చనిపోయి ఉండడంతో నార్మల్‌డెలివరీ చేసేందుకు ప్రయత్నించామని.. ఆ సమయంలో ఆపరేషన్ చేస్తే బ్లీడింగ్ ఆగదని, వెంటనే వెంటిలేటర్‌పై ఉండాల్సి ఉంటుందని అందుకే ఆమెను కరీంనగర్‌కు రిఫర్ చేశామని చెప్పారు.