ఆస్పత్రిలో తల్లి లాస్య, శిశువు
సాక్షి, సిరిసిల్ల : కాన్పు కోసం జిల్లా ధర్మాస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణి డాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడి బాత్రూంలోనే ప్రసవించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. గర్భిణి బంధువుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండలం మండపెల్లికి చెందిన గర్భిణి బుర్ర లాస్య రెండో కాన్పు కోసం తెల్లవారుజామున నొప్పులు వస్తున్నట్లు తెలపడంతో 6 గంటలకు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు.
డాక్టర్ నిర్మల పరీక్షించి డెలివరీకి ఇంకా పదిరోజుల సమయం ఉందని చెప్పి, మళ్లీ రావాలని సూచించారు. దీంతో బిడ్డ నొప్పులంటుందని మరేదైనా ఆసుపత్రికి తీసుకెళ్లాలా అని డాక్టరును అడగ్గా.. అది కూడా మేమే చెప్పాలా .. మీకు తెలియదా అంటూ డాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆసుపత్రి నుంచి వెనుదిరిగే క్రమంలో బాత్రూంకు పోయిన గర్భిణి అక్కడే ప్రసవించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ క్షేమంగా ఉంది. డాక్టరు నిర్లక్ష్యంపై గర్భిణి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
డాక్టర్ల సమక్షంలోనే డెలివరీ అయింది..
సాధారణంగా మొదటి డెలివరీకి 14 గంటల ముందు నుంచే నొప్పులు ప్రారంభమవుతాయి. రెండో డెలివరీకి గంట నుంచి రెండు గంటల ముందు నుంచే నొప్పులు మొదలవుతాయి. డాక్టర్లు పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. గర్భిణి బాత్రూంకు వెళ్లినపుడు ప్రసవం అవుతున్నట్లు గుర్తించడంతో ఆపరేషన్ థియేటర్‌కు తరలించి డాక్టర్ల సమక్షంలోనే డెలివరీ చేశారు. బిడ్డ క్షేమంగా ఉంది.
– తిరుపతి, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment