‘స్మార్ట్’ భాగ్యం మనకూ ఉంది! | does hyderabad change as smart city? | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’ భాగ్యం మనకూ ఉంది!

Published Tue, Oct 7 2014 1:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

‘స్మార్ట్’ భాగ్యం మనకూ ఉంది! - Sakshi

‘స్మార్ట్’ భాగ్యం మనకూ ఉంది!

సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ సిటీ... దేశ వ్యాప్తంగా ఇదే అంశం  ఇప్పుడు హాట్ టాపిక్. హైదరాబాద్ నగరంలో మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైకి అందరి దృష్టీ మళ్లింది. ఈనేపథ్యంలో మన ‘గ్రేటర్’  స్మార్ట్‌సిటీగా మారే ‘భాగ్య’ం ఉందా అని పరిశీలిస్తే ..ఉందన్నదే సర్వత్రా వ్యక్తమౌతున్న అభిప్రాయం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చెందిన పలు నగరాల అనుభవాల నుంచి పాఠాలు స్వీకరిస్తే ‘గ్రేటరూ’...‘స్మార్ట్’గా మారడం కష్టసాధ్యం కాదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ  సిటీ పూర్తిగా అధునాతన డిజిటల్ టెక్నాలజీ వినియోగం పైనే ఆధారపడి విజ్ఞానాధారిత నగరంగా ఎదుగుతుంది కాబట్టి ఇక్కడి పౌరులూ తమ నైపుణ్యాలనూ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. భాగ్యనగరం ‘స్మార్’్టసిటీగా రూపుదిద్దుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడి వనరులు, పౌరుల సహకారం, ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.
 
 భాగ్యనగర ప్రస్థానమిదీ...
 
 భాగ్యనగర నిర్మాణ సమయంలో కేవలం 5 లక్షల జనాభానే దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు అది 20 రెట్లు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా సుమారు 90 లక్షలకు చేరువైంది. సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ అంచనా ప్రకారం.. 2031 నాటికి ఇది 1.84 కోట్లకు చేరుకుంటుంది. వచ్చే 20 ఏళ్ల పాటు నిమిషానికి 30 మంది గ్రామీణులు ఉపాధి, ఉద్యోగం వంటి అనేక కారణాలతో నగరబాట పడతారని నిపుణుల అంచనా. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకూ చేరేకొద్దీ నగరాలకు గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయి. ఇలా వలస వచ్చే వారికి అనువుగా నగరాలు అభివృద్ధి చెందాలి. లేకుంటే ప్రస్తుతం ఉన్నవి త్వరలోనే నివాసయోగ్యం కాకుండా పోతాయి. ఐరోపాలో మాదిరిగా హైదరాబాద్‌లో ఓ క్రమపద్ధతిలో పట్టణీకరణ జరగలేదు. మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందలేదు.
 
 ప్రధాని మోదీ కల
 
 దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలనేది ప్రధాని మోదీ లక్ష్యం. ఇందుకోసం రూ.7,060 కోట్లను ఖర్చు చేయనున్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మాణ విస్తీర్ణాన్ని 50 వేల చ.మీ. నుంచి 20 వేల చ.మీ.కు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించారు. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు 3 ఏళ్ల కాల పరిమితిని నిర్దేశించారు.
 
 పలు స్మార్ట్‌సిటీల విజయ గాథలివీ..
 
 ఆమ్‌స్టర్ డ్యామ్: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్ స్మార్ట్ సిటీ ‘మొబైల్ అప్లికేషన్స్’ ద్వారా తమ రహదారులపై రవాణా రద్దీ గుర్తించి ముందస్తు సమాచారాన్ని పౌరులకు అందిస్తుంది. దీనికి జీపీఎస్‌ను ఉపయోగించుకుంటుంది. ఫలానా కూడలిలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని పసిగట్టి, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. దీని వల్ల పౌరులకు సమయం, ఇంధనం ఆదా అవుతాయి. అత్యవసర సేవలు సకాలంలో అందుకొనే వీలు కలుగుతుంది. దీనికి భిన్నంగా మన నగరాల్లో అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుంటాయి.
 
 వియన్నా: ఆస్ట్రియా రాజధాని వియన్నా పలు ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రపంచ టాప్ 10 స్మార్ట్ సిటీ జాబితాలో చేరింది. ఇన్నోవేషన్ సిటీలో 5వ స్థానం, రీజనల్ గ్రీన్ సిటీలో 4వ స్థానం, క్వాలిటీ ఆఫై లైఫ్‌లో ప్రథమ స్థానం, డిజిటల్ గవర్నెన్స్‌లో 8వ స్థానం సంపాదించింది. ఇక్కడి ప్రభుత్వ పథకాల విషయానికొస్తే.. స్మార్ట్ ఎనర్జీ విజన్-2050, రోడ్‌మ్యాప్ 2020, యాక్షన్ ప్లాన్ 2012-15 వంటి ప్రభుత్వ కార్యక్రమాలు వియన్నా స్మార్ట్ సిటీగా పురోగతి చెందడంలో దోహదపడ్డాయి.
 
 టొరంటో: కెనడాలోని ఒంటారియా రాజధాని టొరంటో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోవడంలో ఆధునిక టెక్నాలజీ వినియోగమే ప్రధాన కారణం. నవీకరణ, వ్యవస్థాపక సామర్థ్యాలకు ప్రోత్సాహం, ఆర్థిక కార్యకలాపాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనుసంధానం, తీరైన శాంతిభద్రతలు, న్యాయపాలన, డీమ్యాట్ రూపంలో భూములు, భవనాలు, దస్తావేజులను భద్రపరచడం వంటివన్నీ టెక్నాలజీతో అనుసంధానం చేశారు. దీనివల్ల లావాదేవీలకయ్యే ఖర్చులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
 
 
 నేడు చర్చలో పాల్గొనే ప్రముఖులు వీరే...
 
 ఐదు రోజుల అంతర్జాతీయ 11వ మెట్రోపొలిస్ సదస్సులో భాగంగా మంగళవారం ‘థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్’ అనే థీమ్ ఆధారంగా ‘స్మార్ట్‌సిటీస్’ అంశంపై పలుదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. సదస్సులో పాల్గొనే ప్రతినిధులు వీరే..
 
 ఉడ్రోవిల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ గ్లోబల్ ఫెల్లో, అర్బన్ ఏజ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ టిమ్ క్యాంబెల్
 ఎంఐటీ సెన్సబుల్ సిటీ లాబొరేటరీ, మసాచూసెట్స్ డెరైక్టర్ ప్రొ॥ కార్లో రట్టీ
 పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్ డెరైక్టర్, ఓరాకిల్, నెథర్లాండ్స్ లెమ్కీ ఇడ్‌సింగ్
 బ్రసెల్స్ ఫిలిప్ప్ విస్సీ
 ఏసియన్ పసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ మేనేజర్ అల్‌బెర్టో మార్టిన్ టొర్రస్
 సోయెల్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ జూన్హో కో
 అర్బన్ గవర్నెన్స్ ప్రొగ్రామ్, అస్కి డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చారీ వెడల
 కర్నాటక మాజీ చీఫ్ సెక్రటరీ, సెంటర్ ఫర్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్ చైర్మన్ డాక్టర్ ఎ. రవీంద్ర
 
 ఇలా ఉంటేనే ‘స్మార్ట్’
 
 అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజా జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవడం స్మార్ట్‌సిటీలకు చోదకాలుగా చెప్పుకోవచ్చు.
 
 పరిపాలన, విద్యుత్, భవనాలు, రవాణా, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య సేవలు ఆధునిక సాంకేతిక సాయంతో పనిచేసే నగరం ఈ కోవలోకి వస్తుంది.
 
 ట్రాఫిక్ లైట్లు మొదలుకొని భవంతులు వరకూ అన్నీ కంప్యూటర్ నెట్‌వర్క్ లేదా వైఫైతో అనుసంధానమై ఉంటాయి.
 
 వైర్‌లెస్ సెన్సర్లు ఎప్పటికప్పుడు వాతావరణ, ఇతర పరిస్థితులను గమనిస్తూ ప్రజ లకు, అధికారులకు సమాచారమిస్తాయి.
 
 నీటి పైపుల్లో లీకేజీలున్నా, చెత్త కుండి నిండినా కార్పొరేషన్ అధికారులకు సమాచారం వస్తుంది.
 
 ట్రాఫిక్ జామ్‌ల గురించి ప్రజలకు తక్షణ సమాచారం వస్తుంది. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ పరిస్థితులను బట్టి ట్రాఫిక్ లైట్ల వెలుతురులో హెచ్చు తగ్గులుంటాయి.
 
 వాన నీటిని ఒడిసి పట్టి నగరాల్లో పచ్చదనం పెంపునకు వినియోగించుకోవాలి.
 పనిచేసే చోటుకు దగ్గరగానే నివాస
 సముదాయాలు ఉండేలా చూస్తారు.
 మెట్రో, మోనో రైలు వంటి అధునాతన రవాణా వ్యవస్థలు సమకూరుతాయి
 అవసరాన్ని బట్టి స్మార్ట్‌గా పనిచేసే విద్యుత్ గ్రిడ్, పౌర సేవల కోసం ప్రత్యేకమైన టెక్ ఆధారిత ప్రాజెక్ట్‌లును ఏర్పాటు చేస్తారు.
 స్మార్ట్ రోడ్లు, భారీ మైదానాలు, భూగర్భ జలాలు పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.
 అగ్ని ప్రమాదాలు, వాతావరణాన్ని గుర్తించే సెన్సర్లు, ఆటోమేటిక్ విద్యుత్ వ్యవస్థలతో పాటు ఆధునిక రక్షణ ఏర్పాట్లు కల్పిస్తారు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement