ఒప్పందాల వేదిక..‘మెట్రోపొలిస్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన ‘11వ మెట్రోపొలిస్ సదస్సు 2014’ నగరాల మధ్య ఒప్పందాలకు వేదికగా నిలిచింది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన సదస్సు శుక్రవారం ముగిసింది. సదస్సు అర్థవంతమైన చర్చలకు.. ఆయా దేశాల్లోని నగరాల సమస్యలపై అవగాహన, పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఉపయోగపడిందని పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయా అంశాల్లో కలసి పనిచేసేందుకు భాగస్వామ్య ఒప్పందాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నాలుగు నగరాలతో చర్చలు జరిపింది. జీ2జీ(గవర్నమెంట్ టు గవర్నమెంట్) నెట్‌వర్క్ చర్చల్లో భాగంగా బార్సిలోనా(స్పెయిన్), జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా), మసాద్(ఇరాన్), సావోపొలో(బ్రెజిల్) లతో హైదరాబాద్ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా నగరాల నుంచి వచ్చిన అధికారులు/మేయర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
మెరుగైన రహదారులు, వరదల నివారణ, చారిత్రక కట్టడాలు, హైదరాబాద్ పాతబస్తీ పునరుద్ధరణ అంశాలపై బార్సిలోనా, మసాద్, జోహన్నెస్‌బర్గ్‌లతో, సరసమైన ధరలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సావోపొలోతో చర్చలు జరిగాయి. మరో రెండు, మూడు చర్చల అనంతరం ఆయా నగరాలతో పూర్తిస్థాయి ఒప్పందం కుదర్చుకోనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
మెరుగైన సదుపాయాల కోసం..
మెరుగైన పార్కింగ్ సమస్యలు, వరదల నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక వనరుల పెంపు వంటి విధానాలున్న నగరాలతో ఇతర దేశాల నగరాలు ఒప్పందానికి ఆసక్తి కనబర్చాయి. బార్సిలోనా నగరంలో వరదల నివారణకు, వేసవిలో నీటి ఎద్దడి పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం బాగుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్కడ భూగర్భంలో ఎక్కువ పరిమాణంలో నీటిని నిల్వ చేయగల ట్యాంకులు నిర్మించారు. వర్షం నీరంతా వాటిల్లో నిలువ ఉంటుంది. వేసవిలో నీటిఎద్దడి సమయాల్లో సదరు ట్యాంకుల్లోని నీటిని వినియోగిస్తారు. వర్షాలొచ్చేప్పుడు ఎక్కువ నీరు చేరకుండా ఎప్పటికప్పుడు తగిన మొత్తంలో నీటిని వినియోగిస్తారు. తద్వారా రెండు కాలాల్లోనూ ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని మన హైదరాబాద్‌లో అమలు చేసేందుకు అవకాశం ఉందని, జలగం వెంగళరావు పార్కు, కేసీపీ సమీపంలో ఇలాంటివి ఏర్పాటు చేయవచ్చని కమిషనర్ చెప్పారు. ఒంటరిగా ఉంటున్న వయోవృద్ధులు ఆపత్కాలంలో వినియోగించేందుకు రూపొందించిన ఉపకరణం కూడా బాగుందన్నారు. గుండీ మాదిరిగా ఉండే ఉపకరణాన్ని టచ్ చేస్తే చాలు.. ఆప్తులకు అలారం వినిపిస్తుందని, త్వరితంగా వారు చేరుకునేందుకు వీలుంటుందన్నారు.
వచ్చే సదస్సు అర్జెంటీనాలో..
మూడేళ్లకోమారు జరుగనున్న మెట్రోపొలిస్ తదుపరి సదస్సును 2017లో అర్జెంటీనాలోని బ్యూనోస్‌ఎయిర్స్ నగరంలో జరిపేందుకు సదస్సు తీర్మానించింది.