ఈ శతాబ్ది నగరాలదే
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న సవాళ్లను కొత్త ఆలోచనా విధానాలతో ఎదుర్కొనేందుకు పాలనాయంత్రాంగం సిద్ధంకావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అత్యధిక శాతం నగరాలు ఇందుకు సిద్ధంగా లేవన్నారు. పాలనా నిర్వహణను, స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రస్తుత డిమాండ్లను, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్, సీఎస్ రాజీవ్‌శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి రాష్ర్టపతి ప్రసంగించారు. వాతావరణ మార్పులు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు, కాలుష్యం వంటి సవాళ్లను అధిగమించడంతో పాటు మంచినీటి సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థ, చెత్త సేకరణ, దాని నుంచి విద్యుత్ ఉత్పాదన, గ్రీన్ బిల్డింగ్‌ల నిర్మాణం వంటి సేవలను పౌరులకు అందుబాటులోకి తీసుకురావాలని మేయర్లకు సూచించారు. పట్టణాలకు వలస పెరుగుతున్నందున అందరికీ ఇళ్లు సమకూర్చేందుకు వీలుగా గృహ నిర్మాణ పథకాలను చేపట్టాలని, తద్వారా మురికివాడలను కూడా అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. శాటిలైట్ టౌన్ల నిర్మాణం తదితర అంశాల్లో ప్రైవేట్‌కు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. పట్టణీకరణ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదని, 2050కల్లా 75 శాతం ప్రపంచ జనాభా పట్టణాల్లోనే కేంద్రీకృతం కానుందని ప్రణబ్ తెలిపారు. ఈ నే పథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని భారత్ సైతం గుర్తించిందన్నారు.
రాష్ట్రాలకు కేంద్రం చేయూత..
19వ శతాబ్దం రాచరికాలది కాగా, 20వ శతాబ్దం దేశాలదని, 21వ శతాబ్దం మాత్రం నగరాలదేనని రాష్ర్టపతి పేర్కొన్నారు. ‘నగరాలు అందరికీ’(సిటీస్ ఫర్ ఆల్) అనే అంశంపై ఈ అంతర్జాతీయ సదస్సులో జరిగిన మేధోమథనం సత్ఫలితాలనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ ప్రణాళిక, పరిపాలన వంటి అంశాల్లో లోతైన విశ్లేషణల ద్వారా అంతిమ లక్ష్యాలు నెరవేరాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 136 మెట్రో నగరాలకు చెందిన ప్రముఖులు, అందులో వందకుపైగా భారత నగరాలకు చెందిన వారు ఒకే వేదికపై భారత్‌లో సమావేశం కావడం సంతోషకరమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 31 శాతం మంది భారతీయులు నగరాల్లో నివసిస్తున్నారని గుర్తు చేశారు. మౌలికసదుపాయాలు, కనీస సౌకర్యాల విషయంలో భారత్ సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. దేశంలో తొమ్మిది శాతం ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం లేదని, 12.6 శాతం ప్రజలకు మరుగుదొడ్లు లేవని పేర్కొన్నారు. శరవేగంగా సాగుతున్న పట్టణీకరణకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనివ్వడానికి కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని రాష్ట్రపతి తెలిపారు. దేశంలోని 500 నగరాల్లో ఈ పథకాన్ని చేపట్టనున్నట్లు, దీని అమల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని(పీపీపీ) ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. వంద స్మార్ట్‌సిటీల నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకుందన్నారు.
మురికివాడలు మానవాళికి శాపం: సీఎం
మానవాళికి మురికివాడలే శాపాలని, పట్టణ జీవనంలో ఇదే దుర్భరమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నగరాలను మురికివాడలరహితంగా మార్చాలని, అవి మళ్లీ తయారుకాకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం అవసరమన్నారు. ఇస్తాంబుల్ నగరంలోని కట్టడాలను పరిరక్షించినట్లే.. భాగ్యనగరంలోని చారి త్రక సంపదను పరిరక్షిస్తామని, పాతనగర అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో భూముల కొరత సమస్యను శాస్త్రీయంగా అధిగమించేం దుకు అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. స్మార్ట్‌సిటీలు అనేవి మానవీయ కోణంలో పర్యావరణహితంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలను సీఎస్ రాజీవ్‌శర్మ ప్రస్తావించారు. మెట్రోపొలిస్ కాంగ్రెస్ కో ప్రెసిడెంట్, జోహెన్నెస్‌బర్గ్ ఎగ్జిక్యూటివ్ మేయర్ పార్క్స్ టావ్ ప్రసంగిస్తూ.. హైదరాబాద్ అందించిన ఆతిథ్యానికి, స్నేహానికి కృతజ్ఞతలు తెలియజేశారు.