‘దానం’కు చుక్కెదురు
- బొందలగడ్డను కబ్జా చేశారంటూ బస్తీవాసుల ఆగ్రహం
- కాంగ్రెస్ నాయకులపై తిరగబడిన వైనం..
- తిట్ల దండకం అందుకున్న మహిళలు
పంజగుట్ట, న్యూస్‌లైన్: బొందల గడ్డను కబ్జా చేసి అనుచరులను వెంటేసుకొని ఓట్లేయాలంటూ మళ్లీ మా బస్తీకి రావడానికి నీకు ముఖమెక్కడిదంటూ బస్తీవాసులు నిలదీయడంతో మాజీ మంత్రి, ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్ నీళ్లు నమిలారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగేందర్ పంజగుట్ట కార్పొరేటర్ బి. రాజుయాదవ్‌తో కలిసి చింతలబస్తీ సమీపంలోని భోలాశంకర్ భక్తసమాజం నగర్ బస్తీకి వెళ్లారు.
ఓటేయమని కోరేందుకు స్థానికంగా నివసించే పి.గోవిందరాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయితే బంజారాహిల్స్ రోడ్‌నెం. 13లోని మా శ్మశానవాటిక స్థలాన్ని మీ కార్పొరేటర్‌తో పాటు నేతలు కబ్జా చేశారని చెప్పినా వినిపించుకోలేదని, ఇప్పుడు మాత్రం ఓట్లు కావాల్సి వచ్చాయా అని ఆయన దానంను నిలదీశారు. దీంతో నాగేందర్ కంగు తిన్నారు. ‘శ్మశానం కబ్జాకు గురవుతోందని అప్పట్లోనే నేను నిలదీస్తే నువ్వెవడివిరా... నన్ను అడగడానికి అంటూ ఆ రోజు తిప్పి పంపారు.
అంతేకాకుండా రౌడీయిజానికి పాల్పడుతున్న పంజగుట్ట కార్పొరేటర్ రాజు యాదవ్‌ను చూపిస్తూ వీడి సంగతి ఏంటో చూడు అని హెచ్చరించారు. వీడిపై ఏమైనా కేసులుంటే బయటకు తోడండిరా.. అంటూ కార్పొరేటర్‌ను ఆదేశించారు’ అవన్నీ గుర్తులేవా అంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.
ఆయనకు మద్దతుగా స్థానిక మహిళలందరూ ఏకమయ్యారు. ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నేతలపై తిట్ల పురాణం విప్పారు. ఒక్కసారిగా బస్తీ వాసులంతా ఒకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ నేతలపై తిరగబడటంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యకర్తలకు, బస్తీవాసులకు మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బస్తీ వాసులు కాంగ్రెస్‌వారిని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఈ నేపథ్యంలో తనకు స్థానిక కార్పొరేటర్ రాజుయాదవ్ నుంచి ప్రాణహాని ఉందంటూ గోవింద్‌రాజ్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌పై, కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.