డబుల్ బెడ్రూం ఓ డ్రామా
► వీఐపీల సేవలో కలెక్టర్, అధికారులు
► మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారుల అవినీతి
► డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం
హుస్నాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం పథకం ఓ డ్రామా అని, సీఎం దత్తత తీసుకున్న చిన్నమూల్కనూర్‌లో ఇళ్లనిర్మాణానికి అతీగతి లేదని డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. సోమవారం పట్టణంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది 60 వేలు, ఈ ఏడాది 2 లక్షల డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో దాని పద్దే చూపెట్టలేదన్నారు. జిల్లాలో ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారో, ఇంకా ఎంత మందికి ఇవ్వాలో రెవెన్యూ అధికారుల వద్ద రికార్డులు లేవని అన్నారు.
కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగ విఫలమైందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే దమ్ము టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాల కాంట్రాక్టర్లను టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు.
గ్రామాల్లో తాగు నీటి కోసం ప్రజలు రోడ్లపైకి వస్తుంటే పట్టించుకోని కలెక్టర్ వీఐపీల సేవలో తరిస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగమంతా పైలాన్ ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉందని చెప్పారు. సమావేశంలో హౌస్‌ఫెడ్ రాష్ట్ర మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, నాయకులు చిత్తారి రవీందర్, ఎండీ. హుస్సేన్, అయిలేని శంకర్‌రెడ్డి, గురాల లింగారెడ్డి, అక్కు శ్రీనివాస్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.