కల సాకారం | Dream a reality | Sakshi
Sakshi News home page

కల సాకారం

Published Sat, Aug 22 2015 4:13 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

Dream a reality

 ప్రభుత్వ సలహాదారుగా డీఎస్
 కేబినెట్ హోదా దక్కించుకున్న ధర్మపురి
 డీఎస్ శిబిరంలో సంబరాలు
 రెండు రోజుల్లో జిల్లాకు రానున్న శ్రీనివాస్
 
 ‘బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్‌తో కలిసి పాలు పంచుకుంటా’నన్న సీనియర్ రాజకీయ వేత్త దర్మపురి శ్రీనివాస్‌కు తన కల సాకారం చేసుకునే తరుణం వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర స్థాయికి ఎదిగిన డి.శ్రీనివాస్ ఎన్నో కీలక పదవులు చేపట్టారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో అనేక చేర్పులు, మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఇటీవలే డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరారు.  కేసీఆర్  సారధ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచేకునేందుకు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు. కొద్ది రోజులకే డీఎస్‌కు కేబినేట్ హోదా గల ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడటం విశేషం.
 - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
 
 అంచెలంచెలుగా ఎదిగిన ధర్మపురి...
 తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) అంచెలంచెలుగా ఎది గారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో కీలక పదవుల్లో కొనసాగిన ఆయన చివరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం కేసీఆర్.. అదే ప్రకారం డీఎస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. 1982 వరకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు సహకార బ్యాంకులో అధికారిగా పనిచేసిన ఆయన అదే సంవత్సరం రాజకీయ అరంగేట్రం చేశారు. 1983లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా బరిలోకి దిగారు.

మొత్తం ఎనిమి ది పర్యాయాలు ఎమ్మెల్యేగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ రాష్ర్ట, కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.1985లో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1989, 1994లో ఓటమి చెందినా... 1999, 2004లలో ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిం చారు. 2011 అక్టోబర్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికై 2015 మార్చి వరకు శాసనమండలి కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు.
 - డీఎస్ శిబిరంలో హర్షాతిరేకాలు...  

 ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో పాటు కేబినేట్ హోదా కల్పించడం పట్ల డీఎస్ వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పేరున్న  డి.శ్రీనివాస్‌కు అత్యున్నత స్థానం దక్కడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నా... కేసీఆర్‌తో సత్సంబంధాలు కలిగిన ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడం పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ నియామక ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే ఆయన అనుచరులు, అభిమానులు, టీఆర్‌ఎస్ శ్రేణులు నిజామాబాద్‌లోని శ్రీనివాస్ ఇంటివద్ద స్వీట్లు పంచుకుని బాణాసంచాలు పేల్చారు  కాగా.. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన డీఎస్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఆ తర్వాతే జిల్లాకు వస్తారని అంటున్నారు.

 టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు..
 నిజామాబాద్‌కల్చరల్ :   డి. శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించడాన్ని హర్షిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించి డీఎస్‌కు సముచిత స్థానం కల్పించారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. మొదట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఏ.ఎస్.పోశెట్టి, బీరెల్లి లక్ష్మన్‌రావు, రవీందర్‌రెడ్డి, అక్తర్‌ఖాన్, చాంగుభాయ్, పురుషోత్త, పుప్పాల శోభ, ఆకుల చిన్న రాజేశ్వర్, ఆమందు బాల్‌కిషన్,  డి. రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement