జంట జలాశయాల్లో కలుస్తున్న ఎగువ ప్రాంతంలోని మురుగు
మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు శూన్యం
శంషాబాద్ రూరల్: నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ‘మురుగు’ పెద్ద సమస్యగా మారింది. మురుగునీరు జలాశయాల్లోకి చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో జీఓ 111 అమలులో ఉండగా ఎగువ ప్రాంతం గ్రామాల్లోని మురుగంతా వరదనీటితో పాటు జలాశయాల్లో కలుస్తోంది. ఆయా గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. దీంతో జలాశయాల్లోని నీరు కలుషితమవుతోంది. వర్షాకాలంలో వరదనీటితోపాటు మురుగంతా జలాశయాల్లోకి చేరుతోంది.
శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల పరిధిలోని 84 గ్రామాల్లో జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆయా గ్రామాల మీదుగా వచ్చే వరదనీరు వాగులు, కాలువల ద్వారా జంట జలాశయాల్లో కలుస్తోంది. వీటికి ఈసీ, మూసీ వాగుల నుంచి వచ్చే వరదనీరు ప్రధానమైనది కాగా సమీపంలో ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు నేరుగా వీటిల్లోకి చేరుతోంది. గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో మురుగును స్థానికంగా ఉన్న చిన్నపాటి గుంతలు, పొలాలు, చెరువులు, కుంటల్లోకి వదిలేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మురుగు కాలువలను నేరుగా వరదకాలువలు, వాగులు, చెరువుల్లోకి కలిపేస్తున్నారు.
నోటీసులతో సరి..
శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో ఇబ్బడి ముబ్బడిగా విద్యా సంస్థలు ఏర్పాటు కాగా వీటి నుంచి వెలువడే మురుగు జలాశయాల్లో కలుస్తోంది. పరీవాహక ప్రాంతంలో ఉన్న సుమారు 50 ఇంజినీరింగ్, ఇతర విద్యా సంస్థలను మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని పీసీబీ గతంలో నోటీసులు జారీ చేసింది. తర్వాత వీటి గురించి పట్టించుకునే వారు లేక ఆచరణ అమలు సాధ్యం కావడంలేదు. దీనికి తోడు గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనావాసాల సంఖ్య గత 20 ఏళ్లలో రెట్టింపు అయింది. అక్కడి జనాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికే పంచాయతీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. వీటికి తోడుగా మురుగు శుద్ధి ఇప్పుడు పెద్దసమస్యగా మారింది.
నిధుల కొరతతో..
జీఓ 111 నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేదిస్తోంది. పంచాయతీ నిధులతో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చే సుకోవాలని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఒక్కో మురుగు శుద్ధి కేంద్రానికి సుమారు రూ.20 లక్షల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు గ్రామాల్లో అనువైన స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో సొంత ఖర్చులతో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు పంచాయతీలు ముందుకు రావడంలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామాల్లో మురుగును నేరుగా వరదకాలువల్లోకి వదలుతున్నారు. జంట జలాశయాలకు ఎగువ ప్రాంతంలోని గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి కృషి జరగడంలేదని సర్పంచులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామాల్లో సమస్య జటిలం..
జంట జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు సమస్య జటిలంగా మారింది. శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ, కవ్వగూడ, నర్కూడ, సుల్తాన్‌పల్లి, కె.బి.దొడ్డి, మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ, అజీజ్‌నగర్, అమ్డాపూర్, బాకారం, వెంక టాపూర్, నక్కలపల్లి, చిన్నమంగళారం, చిలుకూరు, రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్, వట్టినాగులపల్లి తదితర గ్రామాల్లోని మురుగు జలాశయాల్లో కలుస్తోంది. జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు జలమండలి ప్రణాళికలు రూపొందించినా అమలు కావడంలేదు. సుమారు రూ.35 కోట్ల నిధులతో మినీ ఎస్టీపీ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు గతంలోనే ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
మురుగు మరుగయ్యేనా!
Published Wed, Jun 17 2015 11:49 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement