ఆషామాషీగా తీసుకోవద్దు | Drinking water with the authorities on the grid to form Telangana minister ktr | Sakshi
Sakshi News home page

ఆషామాషీగా తీసుకోవద్దు

Published Sun, Sep 28 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

ఆషామాషీగా తీసుకోవద్దు

ఆషామాషీగా తీసుకోవద్దు

డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై అధికారులతో తెలంగాణ మంత్రి కేటీఆర్
పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచన

 
హైదరాబాద్: ప్రభుత్వం ప్రకటించే కార్యక్రమాల అమలును ఆషామాషీగా తీసుకుంటే సహించేది లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 25నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాలకు ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చినా..పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించే జిల్లాలోనే ప్రారంభించకపోతే.. అంతకంటే అవమానం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే ఒప్పుకునేది లేదన్నారు. ఉద్యోగులు, అధికారులతో ఘర్షణను ప్రభుత్వం కోరుకోవడం లేదని, ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని తెలిపారు. అలా అని చేయాల్సిన పనిచేయకపోతే మాత్రం క్షమించేది లేదన్నారు. శనివారం తెలంగాణ ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రం వస్తే... రెండు గంటలు అదనంగా పనిచేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని, అది ఆషామాషీగా ఇచ్చారని తాను భావించడం లేదని పేర్కొన్నారు. కేవలం ఉద్యోగమని భావించకుండా కష్టపడి పనిచేయాలని కోరారు.

తాగునీరు ప్రజల హక్కు..: తాగునీరు కోరే హక్కు ప్రజలకుందని, దానిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించకపోతే ప్రభుత్వం విఫలమైనట్లేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర మంతటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారని, దీనికి సహకరించాలని మంత్రి ఇంజనీరను కోరారు. ప్రాథమిక సర్వే 95 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారని, అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని స్పష్టతతో నివేదిక రూపొందించాలన్నారు. 2022 నాటికి 100 ఎల్‌పీసీడీల నీరు ఇవ్వాలని నిర్ణయించారని, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని నిధులు కావాలో కూడా నివేదికలో పొందుపర్చాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్, సాగునీటి శాఖ, పురపాలక ప్రజారోగ్య విభాగం ఇంజనీర్లతో సోమవారం సీఎం నిర్వహించే సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని సూచించారు. ఇప్పటికే తాగునీటి పథకాల అమలు జాప్యం అవుతోందని, జడ్పీ సీఈవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు సమన్వయంతో పనిచేస్తే.. ఈ ఇబ్బందులు వచ్చేవి కావని ఆయన వ్యాఖ్యానించారు.  వాటర్ గ్రిడ్ కార్యక్రమానికి నిధులు సమకూర్చడానికి పలు ఆర్థిక సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి అన్నారు. వాటర్ గ్రిడ్‌కు రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
 
తాటాకు చప్పుళ్లకు బెదరం


హైదరాబాద్: బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు చేసే తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తాము దేవుడికి కూడా భయపడే ప్రసక్తి లేదని  మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో శనివారం ‘అర్బన్ హ్యాకథాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రమశిక్షణ, నియమాలకు కట్టుబడి పారదర్శకతతో తెలంగాణ  ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమని ప్రజలు నమ్ముతారని భావిస్తే తాము చేసేదేమీ లేదన్నారు. కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మొదట్లో మెట్రో రైలు స్థలాన్ని ‘మైహోమ్’ సంస్థకు కేటాయించామని ప్రచారం చేశారని, దానిపై క్లారిటీ ఇచ్చాక, ఇక గేమింగ్ సిటీ స్థలమంటున్నారన్నారు. తెలంగాణ  ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం స్థల కేటాయింపులో 99 శాతం పనులు పూర్తి చేసి వెళ్లిందన్నారు. తాము ఒక శాతం మాత్రమే చేసి వివాదం లేకుండా పనిచేస్తే స్కాం అంటూ విమర్శించడం తగదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలకు సంబంధించినవి  ప్రస్తావిస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు.

గేమింగ్ సిటీ ద్వారా 50 వేల మందికి ఉపాధి

గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న గేమింగ్ సిటీ ద్వారా 50 వేల మందికి ఉపాధి లభించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement