మూడున్నరేళ్లలో అందరికీ తాగునీరు | survey for drinking water grid, says kcr | Sakshi
Sakshi News home page

మూడున్నరేళ్లలో అందరికీ తాగునీరు

Published Thu, Sep 11 2014 2:52 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

survey for drinking water grid, says kcr

* ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్
* ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ బాధ్యత ప్రభుత్వ ఇంజనీర్లదే
* ఈ పనులు ప్రైవేటు సంస్థలకు ఇవ్వబోం.. ప్రస్తుత బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు
* గ్రిడ్ కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేస్తామని వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్: మూడున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ రక్షిత మంచి నీరు అందించడమే తాగునీటి గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు సరఫరా చేస్తామని, దానికి ఖర్చయినా సరేనని పేర్కొన్నారు. ఈ పథకాన్ని పూర్తిగా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే నిర్మించి, నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్‌లోనే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తాగునీటి గ్రిడ్ నిర్మాణంపై ఆర్‌డబ్ల్యూఎస్ క్షేత్రస్థాయి ఇంజనీర్లకు బుధవారం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవగాహన సదస్సు, చర్చాగోష్టి నిర్వహించారు. మంత్రి కె.తారకరామారావు, ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, సీఎం ప్రధాన కార్యదర్శి నర్సింగరావుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఏఈ, డీఈఈ, ఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.

తాగునీటి విషయంలో తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా 20 ఏళ్ల కిందే పూర్తిస్థాయిలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా సమీకృత తాగునీటి పథకాన్ని నిర్మించి.. 65 కిలోమీటర్ల దూరంలోని లోయర్ మానేర్ డ్యాం నుంచి సిద్దిపేటకు నీటిని తరలించానని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే వాటర్ గ్రిడ్ నిర్మిస్తామన్నారు. రూ. 20 వేల నుంచి 30 వేలకోట్లతో చేపట్టనున్న ఈ బృహత్తర కార్యక్రమం కోసం తల తాకట్టు పెట్టయినా ఏడాదికి ఐదారువేల కోట్ల రూపాయలను సమకూర్చుతామని చెప్పారు. ఈ గ్రిడ్ నిర్మాణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని 80 శాతం మంది అధికారులు సలహాఇచ్చారని.. కానీ దానికి తాను ఒప్పుకోలేదన్నారు.

‘‘ఈ పనిని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు చేయగలరని నేను వారితో వాదించాను. వారితో ఘర్షణ పడి మీ దగ్గరికి వచ్చా. నా మాటను కాపాడుతరు కదా. మీ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది..’’ అంటూ ఇంజనీర్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. గ్రిడ్ పథకం కోసం అందుబాటులో ఉన్న నీటి వనరులు, పైపులైన్ల పనులు, వనరుల అనుసంధానం తదితర పనులు చేపట్టేందుకు ఇంజనీర్లు నరసింహావతారం ఎత్తాలన్నారు. గ్రిడ్ నిర్మాణంపై త్వరలో అన్ని ప్రభుత్వ శాఖ(విద్యుత్‌శాఖ మినహా)ల ఇంజనీర్లతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయిస్తామని కేసీఆర్ తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో 2,030 ఏఈ పోస్టులు ఉండగా ప్రస్తుతం 1,500 మంది పనిచేస్తున్నారన్నారు. 250 ఏఈ పోస్టులతో పాటు మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. గ్రిడ్ నిర్మాణం అవసరాల దృష్ట్యా ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు.

ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలకు ఐపాడ్‌లు: కేటీఆర్
మండల స్థాయిలో పనిచేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలకు త్వరలో ఐపాడ్‌లు అందజేస్తామని మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం లోపు ఆ విభాగంలో ఖాళీ పోస్టుల వివరాలను తనకు అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
తాగునీటి గ్రిడ్‌కు విరాళాలు
తాగునీటి గ్రిడ్ నిర్మాణానికి పలువురు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు విరాళం ప్రకటించారు. సకల జనుల సమ్మె కాలానికి ప్రభుత్వం చెల్లించిన 42 రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్‌డబ్ల్యూఎస్ జియాలజిస్టు ముందుకు వచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల అసోసియేషన్ సభ్యులు ఈ ప్రాజెక్టు కోసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.
 
నేనెప్పుడూ విఫలం కాలేదు..
తెలంగాణ ఉద్యమం, సమగ్ర సర్వే.. ఇలా తాను ఏ పని చేపట్టినా అవి సాధ్యం కాదంటూ ఎంతో మంది ఎద్దేవా చేశారని.. కానీ జీవితంలో తాను ఎప్పుడూ విఫలం కాలేదని కేసీఆర్ పేర్కొన్నారు. తాగునీటి గ్రిడ్ విషయంలోనూ పూర్తిస్థాయిలో విజయవంతం అవుతానని చెప్పారు. సమగ్ర సర్వే విజయవంతం కావడంతో.. దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఆసక్తి చూపించాయని తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని తాను సింగపూర్ పర్యటనలో చెప్పడంతో.. అక్కడి పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యపోయారని కేసీఆర్ అన్నారు. సింగిల్‌విండో విధానంలో అనుమతులపై తాను ఇచ్చిన హామీల్లో 50 శాతం అమలు చేసినా... లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు తనకు చెప్పారని వెల్లడించారు.
 
రూ. 25 వేల కోట్లతో గ్రిడ్..
రూ. 20 నుంచి 25 వేల కోట్ల అంచనా వ్యయంతో సమీకృత తాగునీటి గ్రిడ్ (టీఎస్‌డీడబ్ల్యూజీ) నిర్మాణం.
గ్రిడ్ నిర్వహణలో భాగంగా విద్యుత్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌లోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు.
ప్రస్తుత నీటి సరఫరాకు అంతరాయం కలగకుండానే గ్రిడ్ పనులు.. అవసరమున్న చోట కొత్తగా డ్యాముల నిర్మాణం.
ప్రతి నియోజకవర్గానికి ఒక డీఈ, మండలానికి ఒక ఏఈ, ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఒక పంప్ మెకానిక్ ఖచ్చితంగా ఉండాలి.
ఆర్‌డబ్ల్యూఎస్ డివిజన్ల సంఖ్య పెరగాలి.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.
అధికారులకు వాహన సౌకర్యం. వాహన సౌకర్యం లేని అధికారులకు రవాణా అలవెన్స్(ఎఫ్‌టీఏ) ప్రతి నెలా చెల్లించాలి.
గ్రిడ్‌పై అవగాహన కల్పించేందుకు త్వరలో ప్రజాప్రతినిధులకు శిక్షణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement