ముగ్గురిని బలిగొన్న డ్రైవర్ అత్యాశ | Driver killed three greedy | Sakshi
Sakshi News home page

ముగ్గురిని బలిగొన్న డ్రైవర్ అత్యాశ

Published Thu, Aug 21 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

Driver killed three greedy

మహబూబాబాద్ టౌన్ : ఆటో డ్రైవర్ అత్యాశ ముగ్గురిని బలిగొంది. వారికి ఆ ప్రయూణమే వారికి ఆఖరి ప్రయూణమైంది. పరిమితికి మించి ప్రయూణికులను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఆటో నుజునుజ్జుకాగా అందులో ప్రయూణిస్తున్న ముగ్గురు ప్రయూణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కంబాలపల్లి శివారులో బుధవారం జరిగిన ఈ సంఘటన బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం... రెడ్యాల శివారు సికింద్రాబాద్ తండాకు చెందిన నారాయణ  తన ఆటోలో 11 మంది ప్రయాణికులను ఎక్కించుకుని మహబూబాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యంలో కంబాలపల్లి వద్ద మరో ఐదుగురిని ఆటోలో ఎక్కించుకున్నాడు.
 
పరిమితికి మించి ప్రయూణికులను ఎక్కించడంతో ఆటో కంబాలపల్లి దాటగానే అదుపుతప్పి కుడివైపునకు దూసుకుపోయి ఓ చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెడ్యాల గ్రామశివారు కొల్లగుంటి తండాకు చెందిన హోంగార్డు బానోత్ ఈర్యా(45) అక్కడికక్కడే మృతి చెందాడు. రెడ్యాల శివారు సోమ్లాతండాకు చెందిన రైతు బానోత్ పంతుల్యా(60) మానుకోట ఏరియూ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందగా, కంబాలపల్లికి చెందిన కొల్లు రత్తమ్మ(65) ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనలో మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. రూరల్ ఎస్సై పవన్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని  కొందరిని తన వాహనంలో, మరికొందరిని వెంటనే 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
హోంగార్డు కుటుంబానికి డీఎస్పీ పరామర్శ  
 
మృతుడు హోంగార్డు బానోత్ ఈర్యా టౌన్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుండేవాడు. అతడి మృతదేహాన్ని మానుకోట డీఎస్పీ పుల్లా శోభన్‌కుమార్ సందర్శించారు. హోం గార్డు కుటుంబాన్ని ఆదుకునే విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆటో ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు.
 
మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్
 
మృతదేహాలను ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు మాచర్ల ఉప్పలయ్య, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, డోలి లింగుబాబు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఎండీ ఫరీద్, తూము వెంకన్న, జెర్రిపోతుల వెంకన్న ఉన్నారు.
 
వీధినపడ్డ హోంగార్డు కుటుంబం
 
హోంగార్డు ఈర్యా మృతితో ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె రోడ్డునపడ్డారు. తండ్రి మృతదేహంపై పడి పిల్లలు విలపించిన తీరు చూసి అక్కడివారితోపాటు డీఎస్పీ సైతం చలించిపోయారు. మరో మృతుడు బానోత్ పంతుల్యాకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొల్లు రత్తమ్మకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
 
క్షతగాత్రులు వీరే..

ఈ ప్రమాదంలో గూడూరు మండలం బొద్దుగొండ శివారు సురేశ్‌నగర్ తండాకు చెందిన వాంకుడోత్ రాంజీ, రెడ్యాల గ్రామశివారు సోమ్లాతండాకు చెందిన భూక్య బాసు, కంబాలపల్లి శివారు పూరీ తండాకు చెందిన కొర్ర సునీల్, రెడ్యాల శివారు వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన కళ్లెం ఉపేంద్రమ్మ, కంబాలపల్లికి చెందిన యానాల భాగ్యమ్మ, యానాల మైథిలీ, యానాల భవ్య, బొద్దుగొండ శివారు ఎర్రగుంటతండాకు చెందిన వాంకుడోత్ వెంకటేశ్, కంబాలపల్లికి చెందిన పెద్ది భద్రమ్మ, రెడ్యాల శివారు సోమ్లాతండాకు చెందిన భూక్య లలిత, భూక్య వెన్నెల, భూక్య సోమ్లా, బానోత్ మదన్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా డ్రైవర్ నారాయణ పరారీలో ఉన్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement