
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 17 జిల్లాల్లో వర్షాభావం ఏర్పడింది. బోరు బావుల్లో నీరు అడుగంటింది. దీంతో రబీ ఆశాజనకంగా లేదు. వరి నాట్లు ఇప్పటికీ ఒక్క ఎకరాలోనూ పడలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు మార్గనిర్దేశం చేయాల్సిన వ్యవసాయ శాఖ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కసరత్తు మొదలు పెట్టలేదు. దీంతో రైతులు గందరగోళంలో పడ్డారు. కంటింజెన్సీ ప్రణాళిక రచించి రైతులను ఆదుకోవాల్సిందిపోయి రోజువారీ పనుల్లోనే పడిపోయారు. రైతుబంధు, రైతుబీమా తప్ప వ్యవసాయ శాఖ మరో అంశాన్ని పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఆ పథకాలకు తప్ప మిగిలిన వాటికి నిధులు కేటాయించట్లేదన్న విమర్శలూ ఉన్నాయి.
పడిపోయిన భూగర్భ జలాలు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిరాశ పరిచాయి. గత జూన్ నుంచి ఇప్పటివరకు 17% లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 15% అధికంగా వర్షపాతం నమోదైనా, జూలైలో ఏకంగా 30% లోటు నమోదైంది. ఆగస్టులో 18% అధికంగా రికార్డు కాగా, సెప్టెంబర్‌లో 35% లోటు నమోదైంది. అక్టోబర్‌లో ఏకంగా 93 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో అనేక ఖరీఫ్ పంటలు ఎండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్రంలో 9.36 మీటర్ల లోతుల్లో నీరు లభించగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 9.94 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి.
కంటింజెన్సీ ప్రణాళికే కీలకం..
రబీ పరిస్థితి ఆశాజనకంగా లేదని వ్యవసాయ శాఖ వర్గాలే చెబుతున్నాయి. బోరు బావులు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో వరి అనుకున్నంత మేర సాగయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయితే రబీలో వర్షాభావం నెలకొంటే, వరి సాగయ్యే పరిస్థితి లేకుంటే అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి. నవంబర్ 15 తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఆరుతడి పంటలే కీలకం. జొన్న, మినుములు, నువ్వులు వంటి వాటిని సాగు చేస్తారు. కానీ అదనపు విత్తనాల సరఫరాపై వ్యవసాయ శాఖ దృష్టి సారించలేదన్న ఆరోపణలున్నాయి. రబీలో అవసరమయ్యే విత్తనాలకే పరిమితమయ్యారు కానీ వర్షాభావం నెలకొంటే ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం రబీలో 4.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
అందులో ఇప్పటివరకు 69,204 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వాటిలో 58,176 క్వింటాళ్లే అమ్ముడుపోయాయి. వాస్తవంగా రబీ వరి విత్తనాలు 2.22 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. రబీలో మొక్కజొన్న విత్తనాలకు డిమాండ్ ఉన్నా వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచలేదు. వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, నువ్వులు, మినుములు, పెసర, కందులు, పిల్లిపెసర వంటి వాటిని అందుబాటులో ఉంచాలి. కానీ సాధారణ రబీకి కూడా వాటిని సరఫరా చేయలేదు. విచిత్రమేంటంటే సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేసేందుకు కూడా వ్యవసాయ శాఖ వద్ద నిధుల్లేవు. వివిధ కంపెనీలకు రూ.100 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు వ్యవ సాయ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దీంతో కంపెనీలు కూడా విత్తనాలను సరఫరా చేసేం దుకు ముందుకు రావట్లేదని చెబుతున్నారు.
దారుణంగా వరి..
వరి పరిస్థితి దారుణంగా ఉంది. సాధారణంగా రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఒక్క ఎకరాలోనూ నాట్లు పడలేదని వ్యవసాయ శాఖే ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించింది. వికారాబాద్, మేడ్చల్, సిద్దిపేట, గద్వాల, నల్లగొండ, యాదాద్రి, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఎకరాలో కూడా ఏ పంటలూ సాగు కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment