సుష్మను చేరుకో‘లేఖ’..! | dubai victims letter not to reach sushma swaraj | Sakshi
Sakshi News home page

సుష్మను చేరుకో‘లేఖ’..!

Published Wed, Oct 1 2014 6:56 PM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

సుష్మను చేరుకో‘లేఖ’..! - Sakshi

సుష్మను చేరుకో‘లేఖ’..!

‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది’ దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఐదుగురు ఖైదీల పరిస్థితి.

హైదరాబాద్: ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది’ దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఐదుగురు ఖైదీల పరిస్థితి. ఖైదీల విడుదలకు సహకరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సెప్టెంబర్2న రాసిన లేఖ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు అందకపోవడంతో వారి విడుదల ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్ రాయ్ 2005లో దుబాయిలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకటి, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, సయ్యద్‌లకు శిక్షపడింది. అప్పటి నుంచి వారు దుబాయ్ జైలులో ఉన్నారు. దుబాయ్‌లో అమలులో ఉన్న షరియా చట్టం ప్రకారం రూ.15లక్షల బ్లడ్ మనీ చెల్లిస్తే నిందితులను క్షమించి విడుదల చేయడానికి హతుడి కుటుంబసభ్యులు అంగీకరించారు.

గతేడాది మేలో కేటీఆర్ నేతృత్వంలో ‘మై గ్రాంట్స్ రైట్స్ కౌన్సిల్’ సభ్యులు నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లి దిల్‌ప్రసాద్ రాయ్ భార్యకు ఆ మొత్తాన్ని చెల్లించారు. దీంతో ఖైదీల విడుదలకు అంగీకరిస్తూ ఆమె గతేడాది జూన్ 5న సంబంధిత పత్రాలను నేపాల్ విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖకు సమర్పించింది. అయితే, ఆ పత్రాలు దుబాయ్ ప్రభుత్వానికి చేరకపోవడంతో ఖైదీలను విడుదల చేయలేదు. మరోసారి స్పందించిన కేటీఆర్ గతనెల 2న సుష్మాకు లేఖరాశారు.

ఖైదీల విడుదలకు సంబంధించిన పత్రాలను దుబాయ్ ప్రభుత్వానికి పం పించేలా నేపాల్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ లేఖలో కోరారు. అయితే, ఖైదీల విడుదల కోసం ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తామే కేంద్రమంత్రిని కలసి ఈ లేఖను అందిస్తామని తీసుకెళ్లినట్లు సమాచారం. విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్న సుష్మాస్వరాజ్‌ను ఈ స్వచ్ఛంద ప్రతినిధులు కలవలేకపోవడంతో ఇంకా ఆ లేఖ విదేశాంగ శాఖకు చేరలేదని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement