పాత ‘పట్టా’లకు ‘డబుల్’ ధమాకా! | Easing the ban on the issuance of those tracks! | Sakshi
Sakshi News home page

పాత ‘పట్టా’లకు ‘డబుల్’ ధమాకా!

Published Tue, Oct 13 2015 11:14 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

పాత ‘పట్టా’లకు  ‘డబుల్’ ధమాకా! - Sakshi

పాత ‘పట్టా’లకు ‘డబుల్’ ధమాకా!

హెచ్‌ఎండీఏ పరిధిలో ఇళ్ల పట్టాల జారీపై,నిషేధం సడలింపు!
నాటి లబ్ధిదారులకు  రెండు పడకల ఇళ్లు

 
 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గూడులేని పేదలకు శుభవార్త. జిల్లా ప్రజలకు శాపంగా పరిణమించిన ఇళ్ల పట్టాల పంపిణీపై విధించిన నిషేధాన్ని సడలించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే, ఇళ్ల స్థలాల స్థానే రెండు పడకల గదుల గృహాలను ‘పట్టా’దారులకు అందజేయాలని ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఔటర్‌రింగ్‌రోడ్డు పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీపై 2006లో అప్పటి సర్కారు నిషేధం విధించింది. ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరగకపోవడం, కనీస వసతులు లేక మురికివాడలుగా మారుతుండడం, పట్టాల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు తేలడంతో రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతంతో పట్టాల జారీని నిలిపివేస్తూ ఉత్తర్వులు (జీఓ 493) ఇచ్చింది. రింగ్‌రోడ్డు అవతల ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్లను అభివృద్ధి చేసి కాలనీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే క్రమంలో పట్టాలు కలిగి ఉన్నా.. ఇళ్లులేని పేదలందరికీ రాజీవ్ గృహాకల్ప, ఇందిరమ్మ పథకం కింద నివాసయోగ్యం కల్పించాలని నిర్దేశించింది. అప్పటికే చాలామందికి ఇళ్ల పట్టాలు ఉండడం.. కొందరికి ఇంకా పొజిషన్ ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే 2008లో నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగం కొత్తగా మరో 10వేల మందికి పట్టాలను జారీ చేసింది.

 కిరణ్ నిర్ణయంతో గ ందరగోళం..
 వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం జరిగిన పరిణామాలు పేదలను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. ఇళ్ల పట్టాలు అందాయని సంతోషం ఆవిరయ్యేలా అప్పటి ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డి ఇళ్ల పట్టాలపై మరోసారి నిషేధం ప్రకటించారు. అయితే, ఈ సారి ఏకంగా పరిధిని కూడా విస్తరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే 18 మండలాల్లో ఇళ్ల పట్టాలను ఇవ్వకూడదని ఆదేశించారు. ఈ నేపథ్యంలో దాదాపు 19వేల మంది పేదలు పట్టాలు కలిగియున్నప్పటికీ పనికిరాకుండా పోయాయి. దీంతో ఈ నిషేధం ఎత్తివేయాలని ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం... నిషేధం సడలించడమే కాకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్రాంతాలను కాలనీలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ పథకంలో భాగంగా గతంలో పట్టాలున్నవారికీ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.

అంతేగాకుండా గతంలో ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకొని 120 గజాల విస్తీర్ణంలో రెండు పడకల గదుల గృహాలను నిర్మించి ఇచ్చేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రఘునందన్‌రావును ఆదేశించారు. అలాగే గతంలో పేదల ఇళ్లకు నిర్ధేశించిన పదెకరాలను లేఅవుట్లుగా అభివృద్ధి చేసి ఆదర్శకాలనీలుగా మార్చాలని సూచించారు. తాజాగా పెలైట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న 400 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అంశంలో స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేయాలని  సీఎం కేసీఆర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement