సాక్షి, హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలంటూ ఎన్నికల సంఘం సోమవారం హైకోర్టును కోరింది. శశిధర్ రెడ్డి పిటిషన్‌కు కౌంటర్‌గా ఎన్నికల సంఘం తరపున డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యవాణి పిటిషన్ దాఖలు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు సరైనవి కావని కౌంటర్ కాపీలో పేర్కొన్నారు. 2016-17 డాటా తీసుకుని అందులో ఉన్న అంశాలను శశిధర్ రెడ్డి పిటిషన్‌లో చేర్చారని... ఓటరు జాబితా సవరణలపై కాల వ్యవధి రెండు నెలల నుంచి రెండు వారాలకు తగ్గించడం ద్వారా జాబితాపై ప్రభావం చూపిస్తుందనడం సరైంది కాదని సత్యవాణి కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పిటిషన్‌ను దాఖలు చేశారని, అందులో ఉన్నవన్నీ అవాస్తవాలని కోర్టుకు విన్నవించారు.
2016-17 ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న ఇబ్బందులను సవరణ చేశామని.. ఆ డాటా ఆధారంగా వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కౌంటర్ పిటిషన్‌లో కోరారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కావున మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్‌ను కొట్టి వేయాలని కోరిన ఎన్నికల సంఘం.. ఇప్పటికీ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపింది.
కాగా ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌నే అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment