
ఏడుపాయల్లో ఘోరాలు
ఓ వైపు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటన.. మరోవైపు కిక్కిరిసిన భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలివచ్చిన నేపథ్యంలో ఏడుపాయల్లో పోలీస్ నిఘా కొనసాగుతోంది.
ఆధ్యాత్మిక కేంద్రమైన ఏడుపాయల నేరాలు, ఘోరాలకు నిలయంగా మారింది? భక్తులకు రక్షణ కరువవుతోంది. దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో భక్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు.. కాసింత ప్రశాంతత కోసం ఇటు వస్తే అనుకోని ప్రమాదానికి గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఓ న్యాయవాదిపై ఆగంతకులు కాల్పులు జరిపి, అతని కుటుంబ సభ్యులను బెదిరించి 25 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
పాపన్నపేట: ఓ వైపు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటన.. మరోవైపు కిక్కిరిసిన భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలివచ్చిన నేపథ్యంలో ఏడుపాయల్లో పోలీస్ నిఘా కొనసాగుతోంది. అడుగడుగునా సాయుధులైన పోలీసులు పహారా కాస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు అగంతకులు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ న్యాయవాదిపై కాల్పులు జరిపి వారి కుటుంబీకుల నుంచి సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఆదివారం పట్టపగలు ఏడుపాయల్లో జరిగిన కాల్పుల సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది రంగంవేణు తన కుమారుడి మొక్కు తీర్చుకునేందుకు తండ్రి గంగాధర్, తల్లి రాజమణి, భార్య సంయుక్త, చెల్లెలు సాయివిద్య, కుమారుడు విశ్వక్‌సేన్ కలిసి కారులో ఆదివారం ఏడుపాయలకు వచ్చారు. దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఏడుపాయల సమీపంలోని మురళీకృష్ణ ఆలయం వద్ద భోజనం చేసి సేదదీరారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హెల్మెట్ ధరించిన ఓ యువకుడితో పాటు మరో యువకుడు స్ల్పెండర్‌పై వచ్చిరాగానే గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
అనంతరం వేణు కుటుంబీకులను బంగారు ఆభరణాలు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. ఈ హఠాత్ సంఘటనతో భయభ్రాంతులకు గురైన మహిళలు తమ ఆభరణాలు తీసి ఇస్తుండగా వేణు రెండడుగులు ముందుకు వేశాడు. దీంతో దుండగులు కాల్పులు జరపడంతో కుడి మోకాలిని రాసుకుంటూ వెళ్లిన బుల్లెటు వేణు ఎడమ కాలిలోకి దూసుకు పోయింది. దీంతో వేణు కిందపడగానే దుండగులు సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. దీంతో వేణు కుటుంబీకులు కారులో రోడ్డుపైకి వచ్చి చికిత్స నిమిత్తం ఏడుపాయల కమాన్ వద్దకు గల ఓ ఆర్‌ఎంపీ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం 108కు సమాచారమిచ్చి మెదక్ ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు. కాగా వేణుకు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా సంఘటన స్థలాన్ని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, మెదక్ డీఎస్పీ గోద్రూ, రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ సందర్శిం చారు. అక్కడ రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మాటువేసి.. కాపు కాసి...
ప్రత్యక్ష సాక్షులు స్వరూప, యాదమ్మ, శేఖమ్మల కథనం.. వారి మాటల్లోనే..‘మేము మురళీకృష్ణ గుడివద్ద కట్టెలు ఏరుకుంటున్నాం. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అరగంట నుంచి అక్కడే తచ్చాడుతున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఐదుగురు కుటుంబీకులు భోజనం చేసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే ఆ ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో భయపడిన మేము దూరంగా వెళ్లి కేకలు పెట్టాము. దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకులు బైక్‌పై పారిపోయారు. వారికి సుమారు 25 యేళ్లుంటాయి.
మంత్రి పర్యటన రోజే.. దారుణం
ఏడుపాయల్లో జరుగుతున్న ఓ ప్రైవేట్ విందు కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వచ్చారు. అయితే అంతకు రెండు గంటల ముందే కాల్పుల సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసు వర్గాలు, భ క్తుల్లో కలకలం రేపింది. ఆదివారం రోజు వేలాది భక్తులు ఏడుపాయలకు తరలివచ్చిన సమయంలోనే పట్టపగలు జరిగిన కాల్పులు, దోపిడి ఉదంతం సంచలనం కలిగించింది.
మొక్కు తీర్చుకునేందుకు వస్తే.. ఇదేం ఘోరం
మొక్కులు తీర్చుకునేందుకు వస్తే ఇలా జరుగుతుందను కోలేదు. సంతోషంతో వచ్చిన తమకు తీరని విషాదం మిగిలింది. పుణ్య స్థలంలో ఇలాంటి దారుణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. దుండగులను పోలీసులు వెంటనే పట్టుకోవాలి.
- వేణు, బాధితుడు