
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కృషి చేస్తోందని, ఫలితాలు వచ్చేందుకు 6 నెలల నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశముందని డాక్టర్ సోమ్‌దత్తా కరక్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీసీఎంబీ ఈ దిశగా కొన్ని నెలల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని కరోనా రోగుల నుంచి తాము ఇప్పటికే వైరస్ నమూనాలు సేకరించి వాటిని పరిశోధన శాలలోనే వృద్ధి చేస్తున్నామని ఆమె తెలిపారు. (‘కరోనా’పై పోరులో సీసీఎంబీ ముందడుగు)
జీవకణాలు ఉంటేనే మనుగడలో ఉండే వైరస్‌ను పరిశోధనశాలలో వృద్ధి చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని, ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, పద్ధతులు అవసరమని చెప్పారు. ఈ వైరస్‌ను ఉపయోగించుకుని ప్రైవేటు కంపెనీలతో కలిసి టీకా ఉత్పత్తి చేయాలన్నది సీసీఎంబీ ఉద్దేశమని ఆమె వివరించారు. ఈ దిశగా సీసీఎంబీ ఇప్పటికే విన్స్ బయోటెక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, మరిన్ని కంపెనీలు సీసీఎంబీతో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపాయని తెలిపారు. టీకా అభివృద్ధిలో పలు దశలుంటాయని, వీలైనంత ఎక్కువ పరీక్షలు నిర్వహించడం ద్వారా టీకా సమర్థతను, పనితీరును మదింపు చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుందన్నారు. అందువల్లనే టీకా అభివృద్ధికి కొంచెం ఎక్కువ సమయం పడుతోందని వెల్లడించారు.