తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆవతరణ వేడుకలు జూన్ 1 రాత్రి 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా పేలుళ్లతో ప్రారంభమవుతాయన్నారు.
జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి నగదు అవార్డులను ఉత్సవాల్లో ప్రదానం చేస్తారని తెలిపారు. జిల్లాలో మండలస్థాయి, నగర పంచాయతీ/మున్సిపాల్టీ, మున్సిపల్ కార్పొరేషన్‌స్థాయి, జిల్లాస్థాయిల్లో మొత్తం 775 అవార్డులను అందజేస్తామన్నారు. వెంటనే అవార్డు గ్రహితలను ఎంపిక చేయాలని ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్, సర్కస్ గ్రౌండ్‌లో వేడుకుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నిర్వహణ కమిటీలు వేడుకల విజయవంతానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, అసిస్టెంట్ కలెక్టర్ అద్వైత్‌సింగ్, జిల్లా పరిషత్ సీఈవో సూరజ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, డీపీఆర్‌వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.