ముహూర్తానికే నామినేషన్లు వేయాలి.. | Election Candidates Nominations Warangal | Sakshi
Sakshi News home page

ముహూర్తానికే నామినేషన్లు వేయాలి..

Published Thu, Nov 15 2018 8:46 AM | Last Updated on Sat, Nov 17 2018 9:48 AM

Election Candidates Nominations Warangal  - Sakshi

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒకే రోజు 30 మంది నామినేషన్లు వేశారు. బుధవారం   బాగుందని అన్ని ప్రధాన పార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు, స్వతంత్రులు, తిరుగుబాటుదారులు నామినేషన్లు సమర్పించారు. కొంతమంది ముహూర్తం చూసుకొని మరీ వేయడం విశేషం. నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమలో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి ఓటరు దేవుళ్లనే నమ్ముకుని కార్యకర్తలతో కలిసివెళ్లి నామినేషన్లు వేశారు. భూపాలపల్లిలో స్పీకర్‌ మధుసూదనాచారి కార్యకర్తలతో వెళ్లి నామినేషన్‌ వేశారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 9 నామినేషన్లు.. 
వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజక వర్గాల నుంచి మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్‌ పశ్చిమలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్‌ భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్‌ వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి నాయిని నామినేషన్‌ వేశారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు వేయగా, అదే పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

ఇండిపెండెంట్‌గా తిరునహరి శేషు నామినేషన్లు వేశారు. తూర్పు నుంచి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పార్టీ అభ్యర్థిగా సిద్ధం రాంబాబు, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అలకాపల్లి కిశోర్, ఇండిపెండెంట్‌గా నీలం రాజ్‌కిశోర్, సండ్ర జాన్సన్, వర్ధన్నపేట నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరూరి రమేష్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమలోనే ఎక్కువగా నామినేషన్లు 
సమర్పించారు.

భూపాలపల్లిలో..
భూపాలపల్లి, ములుగు రెండు నియోజకవర్గాలు కలిపి ఏడు నామినేషన్లు వచ్చాయి.  భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిరికొండ మధుసూదనాచారి, ముందుగా నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం నామినేషన్‌ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్‌ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి తరుపున మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ గులాం అప్జల్‌ నామినేషన్‌ వేశారు.

బీజేపీ తరఫున చందుపట్ల కీర్తిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆల్‌ ఇండియా పార్వర్డ్‌ పార్టీ తరఫున గండ్ర సత్యనారాయణరావు నామినేషన్‌ వేశారు.  కొండ దేవరగట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ములుగు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అజ్మీర చందూలాల్‌ నామినేషన్‌ వేశారు. సీతక్క తరఫున ఆమె బందువులు గట్టమ్మ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రెండు సెట్ల నామినేషన్‌లు రిటర్నింగ్‌ అధికారికి అందించారు. టీఆర్‌ఎస్‌ అసమ్మతి వర్గ నేత పొరిక గోవింద్‌నాయక్‌ ములుగులో తన నామినేషన్‌ను సమర్పించారు.

మహబూబాబాద్‌ జిల్లాలో..
మానుకోట జిల్లాలో 5 నామినేషన్లు పడ్డాయి. తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ తొలు త జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో, మానుకోట మండలంలోని ఈదులపూసపల్లి దర్గాలో జిల్లా కేంద్రంలోని ఏసుశక్తి చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం నామినేషన్‌ వేశారు.  కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయ క్‌ కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ మూలగుండ్ల వెంకన్న, ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌ ప్రసాద్‌ బలరాంనాయక్‌కు సంబంధించిన నామినేషన్‌ పత్రాలు అధికారులకు అందజేశారు.

 స్వంతత్ర అభ్యర్థి ధర్మసోత్‌ నారాయణసింగ్‌ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రలోని అంబేడ్కర్‌ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముత్యాలమ్మగుడిలో పూజలు చేసి నామినేషన్‌ వేశారు. డోర్నకల్‌ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి జాటోత్‌ రాంచంద్రునాయక్‌ కురవి దేవస్థానంలో పూజలు చేసి ఆ తర్వాత మరిపెడ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్వో ఈశ్వరయ్యకు నామినేషన్‌ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ తొలుత కురవి దేవస్థానంలో పూజలు చేసి ఆ తర్వాత ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు ఇచ్చారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో..
జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మూడో రోజు ఆరుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో 8 మంది నామినేషన్‌లు వేశారు.  బుధవారం నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డి, బీజేపీ నుంచి బుర్రి ఉమాశంకర్, శివసేన నుంచి పూర్ణచందర్‌ తోట, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి రెండు సెట్‌లు, ఇండిపెండెంట్‌గా బుచ్చిరెడ్డి, వర్ధన్నపేట నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరూరి రమేశ్‌ రెండు సెట్‌లు నామినేషన్లు వేశారు. చల్లా ధర్మారెడ్డి తొలుత వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తర్వాత సంగెం మండలంలోని కుంటపల్లిలోని సంగమేశ్వరాలయం, కొమ్మల లక్ష్మీ నరసింహాస్వామి, ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని సమ్మక్క సారలమ్మ, పరకాలలోని కుంకుమేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి పరకాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మహేందర్‌జీకి నామినేషన్‌ పత్రాలను అందించారు. నర్సంపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి సాదా సీదాగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.రవికి నామినేషన్‌ పత్రాలను అందించారు. వర్ధన్నపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరూరి రమేశ్‌ తొలుత ఐనవోలు మల్లిఖార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత రెడ్డిపాలంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నారం షరీఫ్‌లోని దర్గాలో పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్‌ పత్రాలను అందించారు.
 
జనగామలో..
జనగామ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉదయం తన సోదరీమణులు రూపురెడ్డి యశోదాదేవి, తవిటిరెడ్డి మనోహర పాదాలకు నమస్కారం చేసుకొని నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.  యశ్వంతాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేశారు. సీఎం కేసీఆర్, జయశంకర్‌ చిత్రపటాలకు దండం పెట్టుకొని నామినేçషన్‌ వేయడానికి బయలుదేరారు.

శుభ ముహూర్తం చూసుకొని సరిగ్గా 2:30 గంటలకు ఆర్వో మధుమోహన్‌కు తన నామినేషన్‌ పత్రాలను అందించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్‌ తాటికొండ రాజయ్య నామినేషన్‌కు ముందు, ఆ తర్వాత ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. కాజీపేటలోని బిష‹ప్‌ ఉడుముల బాల ఆశిస్సులను తీసుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్‌ వేశారు. తర్వాత ఘన్‌పూర్‌లో ఉన్న తల్లికి పాదాభివందనం చేశారు. ఆర్‌సీఎం చర్చిలో ప్రార్థనలు, ఘన్‌పూర్‌లోని బొడ్రాయి, మసీదు, శివునిపల్లిలోని బొడ్రాయి వద్ద పూజలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
ఆర్వోకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న నాయిని రాజేందర్‌రెడ్డి1
1/5

కాంగ్రెస్‌ రెబల్‌గా నాయిని..

నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న రావు పద్మ అమరేందర్‌రెడ్డి2
2/5

బీజేపీ పశ్చిమ రెబల్‌గా పద్మ..

 బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న మార్తినేని ధర్మారావు3
3/5

బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా ధర్మారావు..

ములుగులో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న  చందూలాల్‌4
4/5

 టీఆర్‌ఎస్‌ ములుగు అభ్యర్థిగా చందూలాల్‌..

ఘన్‌పూర్‌లో నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజయ్య 5
5/5

 టీఆర్‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థిగా రాజయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement