
నల్లగొండలో పార్టీల తోరణాలు తొలగిస్తున్న సిబ్బంది
సాక్షి, నల్లగొండ : ఎన్నికల మోడల్ కోడ్‌ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. శనివారం ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రజలను ఆకర్షించే పథకాలను అమలు చేయొద్దని కమిషన్ సూచిం చింది. దీంతో అధికారులు నిబంధలన ప్రకారం చేపట్టాల్సిన చర్యలను గట్టిగా అమలు చేస్తున్నారు.
రాత్రికిరాత్రే కోడ్ అమలు..
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మోడల్ కోడ్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రాత్రికిరాత్రే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న రాజకీయ పార్టీల హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లను సిబ్బంది చేత తొలగింపజేశారు. నల్లగొండ, చిట్యాల, మిర్యాగూడ, హాలియా, దేవరకొండ, చండూరు పట్టణాల్లో పార్టీలకు సంబంధించిన బ్యానర్లను తొలగించారు. గ్రామపంచాయతీల్లోనూ మోడల్ కోడ్ అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఉప్పల్ డీపీఓకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో పార్టీల బ్యానర్లు ఇతర రాతలను తొలగించాలని సూచించారు.
రాజకీయపార్టీల కదలికపై కన్ను..
మోడల్ కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పా ర్టీలు ఓటర్లను ఆకట్టుకునే, మభ్యపెట్టే ప్రకటనలపై నిఘా పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో.. మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా..? అనే దానిపై నిఘా పెంచారు. ఎన్నికల్లో అభ్యర్థులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తారు. అందుకు సంబంధించి ఇప్పటికే కమిటీ కూడా వేసింది.
బదిలీలు నిషేధం..
రాజకీయ నేతలకు ప్రభుత్వ ఆధీనంలోని గెస్ట్ హౌజ్‌లు, కార్యాలయాలు ఇవ్వవద్దని ఎన్నికల కమిష న్ సూచించింది. అధికారులు కూడా ప్రైవేట్ పను ల కోసం మంత్రులను కలవద్దని ఆదేశించింది. పోలీస్, తదితర శాఖల్లో బదిలీలు నిషేధించింది. పోస్టింగులు ఇవ్వొద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఆదేశించింది.
ఎంసీఎంసీ కమిటీ నియామకం..
ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులు టీవీ, పత్రికల్లో ఎలాంటి ప్రకటనలు ఇవ్వాలన్నా.. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కమిటీని నియమించారు. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా డీఆర్వో, పౌరసంబంధాల అధికారి ఉంటారు. ఈ కమిటీకి తెలియకుండా మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఇచ్చేందుకు వీల్లేదు.
ఎన్నికల సంఘం ఆదేశానుసారం తొలగిస్తున్నాం
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే రాజకీయ నేత ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగిస్తున్నాం. మోడల్ కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల అధకారి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు .దాంతో అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు తొలగిస్తున్నాం. – దేవ్ సింగ్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment