
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సింబల్
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : మనది ప్రజాస్వామ్య దేశం. ఓటరు తమ ఓటు ద్వారా మంచి వ్యక్తులను గద్దెనెక్కించే సత్తా ఉంది. ఈ అధికారాన్ని ఓటరుకు రాజ్యాంగం హక్కుగా కల్పించింది. అలాంటి విలువైన ఓటు వేయాలంటే దాని వెనుక ఎంతో మంది అధికారుల కృషి ఉంటుంది. గ్రామ స్థాయి బూతు లేవల్ అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఎన్నికలు ప్రశాతంగా పూర్తవుతాయి.అధికారుల్లో సమన్వయం లోపిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు నుంచి పోలింగ్,ఎన్నికల నియమావళి,అమలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువరించే వరకు అధికారులు బాధ్యతగా పనిచేయ వలసి ఉంటుంది. మరి ఏ అధికారికి ఏయే బాధ్యతలు..అధికారాలు ఉంటాయో తెలుసుకుందాం.
ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతలు:
శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నిక కమిషన్ ఈ అధికారిని నియమిస్తుంది. ఆయన సంబంధిత నియోజకవర్గ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. నామినేషన్ పక్రియా, తుది జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెళ్లడి వంటి అన్ని అంశాలు ఈ అధికారి పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు.
సెక్టోరల్ అధికారి :
8 నుంచి 10 పోలింగ్ కేంద్రాల పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పరిస్థితులను బట్టి పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించే అధికారాలు వీరికి ఉంటాయి.
ఓటు నమోదు అధికారి :
ఓట్ల నమోదు జాబితాను తయారు చేయడం ఆయన ప్రధాన విధి. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు, జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు అధికారిని సంప్రదించ వలసి ఉంటుంది.
ప్రిసైండింగ్ అధికారి :
సంబంధిత పోలింగ్ కేంద్రానికి ప్రిసైండింగ్ అధికారిదే పూర్తి బాధ్యత. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను, వీవీపాట్‌లను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, ఎన్నికలను ప్రశాతంగా నిర్వహించి,మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూమ్‌లో చేర్చే వరకు ఈ అధికారి బాధ్యత వహిస్తారు. వీరికి సహాయ ప్రిసైండింగ్ అధికారులు ఉంటారు.బాధ్యతలను అప్పగించిన పోలింగ్ స్టేషన్‌లో జరిగే కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయి.
సూక్ష్మ పరిశీలకులు :
ఎన్నికల నిర్వహణ జరిగిన తీరు, సంబంధిత పర్యవేక్షణపై నివేదిక రూపొందించి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు.
బూత్ లెవల్ అధికారి :
కొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పులు సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులు ఓటు నమోదు చేసుకునేలా చూడడం, ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వారి బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment