సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ధన ప్రవాహం జరిగినా.. ఎవరైనా విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా ఎన్నికల సంఘం(ఈసీ) వలలో చిక్కుకున్నట్లే! ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఏమీ కాదులే.. అని అనుకుంటే మూడినట్లే!! కోడ్‌ను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త! మీ చుట్టూరా ఉన్నవారి చేతిలో నిఘానేత్రం ఉంది. అదేంటో కాదు, స్మార్ట్‌ఫోన్..! అవును, ఒక్క మీటతో నేరుగా ఎలక్షన్ కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేసే యాప్ వచ్చేసింది.
డబ్బులు పంచుతూ చిక్కినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టినా.. ఆ వీడియోలు, ఫొటోలను చిటికెలో ఎన్నికల అధికారికి చేరవేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికలను అపహాస్యం చేసేలా వ్యవహరించడానికి వీలు లేకుండా ఈసీ రూపొందించిన ‘సి–విజిల్’యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి పౌరుడూ ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చు.
ఎలా పనిచేస్తుందంటే..
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్లో సి–విజిల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జరిగే ఏ చర్య అయినా యాప్ ద్వారా ఫొటో, వీడియో ఆప్షన్ ద్వారా రికార్డు చేయొచ్చు. ఫొటో తీసిన తర్వాత దాని గురించి వివరిస్తూ అప్‌లోడ్ చేస్తే, ఆ ఫిర్యాదును ఐదు నిమిషాల్లో క్షేత్రస్థాయి బృందం పరిశీలనకు జిల్లా రిటర్నింగ్ అధికారి/కలెక్టర్ పంపిస్తారు. యాప్‌లో పొందుపర్చిన జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) ద్వారా మీరున్న ప్రాంతానికి ‘ఫ్లయింగ్ స్క్వాడ్స్’ 15 నిమిషాల్లో చేరుకుంటారు. మరో అరగంటలో ఫిర్యాదుకు సంబంధించిన చర్యలు చేపట్టి నివేదిక పంపుతారు.
50 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారి కేసు స్థితి(స్టేటస్)ని ఉన్నతాధికారులకు చేరవేస్తారు. యాప్ వినియోగిస్తున్న వ్యక్తి జిల్లా కంట్రోల్ రూమ్‌కు, ఎన్నికల్ రిటర్నింగ్ అధికారికి, పర్యవేక్షించే సిబ్బందికి, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌కు కనెక్ట్ అయి ఉంటారు. ఫిర్యాదుదారుడి వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు, ధనప్రవాహం, ఓటర్లకు తాయిలాల ఎరపై నిఘా వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక అధికారుల బృందాలు పనిచేస్తున్నా ఈ యాప్‌తో క్షేత్రస్థాయిలో జరిగే ఉల్లంఘనలను క్షణాల్లో పసిగట్టవచ్చని అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment