విద్యుత్ డిమాండ్ పైపైకి!
- వ్యవసాయానికి పగలే 9 గంటలు ఇస్తుండటంతో పెరిగిన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లుగా వరుస కరువు నెలకొనడంతో రాష్ట్రంలో బోరుబావుల కింద వ్యవసాయం తగ్గిపోయి విద్యుత్ డిమాండ్ సైతం పడిపోయింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో ఆశాజనకంగా వర్షాలు కురవడంతో పంటల సాగు ఊపందుకుంటోంది. దీంతో విద్యుత్ వినియోగం మళ్లీ పుంజుకుంటోంది. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 7,222 మెగావాట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం.
గత ఏడాదిన్నర కాలంలో ఎన్నడూ విద్యుత్ డిమాండ్ 7,000 మెగావాట్లకు చేరలేదు. అధిక శాతం డిమాండ్ 5,000-6,500 మెగావాట్ల మధ్యే నమోదైంది. ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. కొద్దిరోజులుగా వర్షాలు ఆగిపోవడంతో బోర్ల వినియోగం కూడా పెరిగింది.
వరి సాగు పెరిగితే.. విద్యుత్ డిమాండ్ కూడా..: వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 32 % వరి నాట్లు జరిగాయి. వరి సాగు సాధారణ విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటిదాకా 7.78 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా.. ప్రస్తుతం 77.53 లక్షల ఎకరాల్లో (72%) సాగయ్యాయి. వరి సాగు విస్తీర్ణం సాధారణ విస్తీర్ణానికి చేరితే విద్యుత్ డిమాండ్ మరింతగా పెరగనుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది.
ఆగస్టులో 8,500 మెగావాట్లు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో 9,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండొచ్చని అంచనా వేసింది. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస రావు ‘సాక్షి’కి తెలిపారు. 9,000 మెగావాట్ల సరఫరాకు తగ్గట్లు విద్యుత్‌ను సమీకరించామని, ఒకవేళ డిమాండ్ మరింత పెరిగితే బహిరంగ మార్కెట్ నుంచి అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని వివరించారు.