కరెంట్ కష్టాలు తీరుస్తాం
మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్యులతో భేటీలో సీఎం కేసీఆర్
ఆగస్టు నుంచి మెరుగవనున్న సరఫరా
సాగుకు, పరిశ్రమలకు తగిన విద్యుత్ అందిస్తాం
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుందాం
త్వరలో టీఆర్‌ఎస్‌లోకి మరో నలుగురు ఎమ్మెల్యేలు
ఖమ్మం నుంచి ఒకరు, గ్రేటర్ నుంచి ముగ్గురు
గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి
ఏప్రిల్ 25, 26 తేదీల్లో ప్లీనరీ, 27న పార్టీ ఆవిర్భావ సభ
పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని మంత్రులకు సీఎం హితబోధ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూనే, టీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఆగస్టు నుంచి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలకూ కోతల్లేకుండా సరఫరా చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. భూపాలపల్లి విద్యుత్ ఆగస్టుకల్లా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ నిర్మాణంతో పాటు జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపైనా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు హరీశ్‌రావు, అజ్మీరా చందూలాల్ మినహా మిగిలిన వారంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతానికి ఆరుతడి పంటలే మేలు!
ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ని పంపిణీ చేయకపోవడం వల్లే ఖరీఫ్‌లో కష్టాలు వచ్చాయన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని కేసీఆర్ అన్నట్లు సమాచారం. రబీలోనూ కరెంటు కష్టాలుంటాయని ఆయన అన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాలువలకు నీళ్లు వచ్చే అవకాశం లేనందున ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వాలని రైతాంగానికి సూచించాల్సిందిగా మంత్రులకు చెప్పారు. ఆగస్టు నుంచి రైతులకు, పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ అందుతుందని, ఈ దిశగా ప్రభుత్వం చేసిన కృషి ఫలించనుందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణం హామీని నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అసంతృప్తి లేదని అభిప్రాయపడ్డారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సానుకూల స్పందన వస్తోందన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం ద్వారా టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చాలని మంత్రులకు హితబోధ చేశారు.
పార్టీలోకి మరో నలుగురు!
ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్‌ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం తెలిపారు. కొత్తవాళ్ల రాకపై పాత వాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడే కొత్త సెగ్మెంట్ల వల్ల అందరికీ అవకాశం వస్తుందన్నారు. ‘త్వరలోనే గ్రేటర్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఖమ్మం నుంచి మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. 20 మంది మాజీ కార్పొరేటర్లూ పార్టీలో చేరబోతున్నారు. కంటోన్మెంట్ ఫలితాలను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలి. వచ్చే నెలలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకుని సమీక్ష జరుపుకోవాలి.
నియోజక వర్గానికి 25 వేల మంది సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఏప్రిల్ 5లోగా పూర్తి చేయాలి. గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీల ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుకోవాలి. ఏప్రిల్ 25, 26 తేదీల్లో పార్టీ ప్లీనరీని నిర్వహించుకోవాలి. 27న పార్టీ ఆవిర్భావదినం సందర్భంగా భారీ బహిరంగసభ, అదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తే భవిష్యత్తులో మనకు తిరుగుండద’ని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావును నియమించాలని నలుగురు మంత్రులు చేసిన సూచనకు సీఎం అంగీకరించినట్లు సమాచారం.
ప్రభుత్వ పథకాలకు మంచి స్పందన
ప్రభుత్వ పథకాలకు మంచి స్పందన లభిస్తోం దని, టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా అవతరించిందని ఎంపీ కె. కేశవరావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంతో భేటీ తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయనున్నట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు.
కంటోన్మెంట్ ఫలితాల స్ఫూర్తితో గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపనున్నట్లు నాయిని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ గణనీయ ఫలితాలు సాధిస్తుందని మహమూద్ అలీ అన్నారు. గ్రేటర్ మంత్రులు, పార్టీ నేతలతో త్వరలో సమావేశం నిర్వహించున్నట్లు చెప్పారు.
22న సీఎం ఖమ్మం పర్యటన
ఈ నెల 22 నుంచి సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఎన్ని రోజుల పర్యటన ఉంటుందనే విషయంలో స్పష్టత లేకపోయినా, పార్టీలో చేరికలు, ప్రజలతో మమేకమై నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. వరంగల్ పర్యటనకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.