‘ఎమర్జెన్సీ’ చోరీలు | 'Emergency' thefts | Sakshi
Sakshi News home page

‘ఎమర్జెన్సీ’ చోరీలు

Published Sun, Jun 22 2014 1:05 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

'Emergency' thefts

  • ఇద్దరు పాతనేరస్తుల అరెస్టు
  •  చోరీ సొత్తుకొన్న మరో ఇద్దరు కటకటాల్లోకి..
  •  60 తులాల బంగారం స్వాధీనం
  • మెహిదీపట్నం:  పదేళ్లుగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్ద రు ఘరానా దొంగలను ఆసిఫ్‌నగర్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. చోరీకి వెళ్లే సమయంలో తమపై ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు తమ వాహనానికి ‘వైద్య సేవలు అందించే వాహనం.. ఎమర్జెన్సీ డ్యూటీ’ అనే స్టిక్కర్‌ను అతికించుకొని వెళ్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది.  శనివారం  పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...

    బాలాపూర్ సాహీన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఖలీల్(26), సయ్యద్ మజీద్ అలియాస్ జహీంగీర్(35) ఆటోడ్రైవర్లు. జల్సాలకు అలవాటుపడిన వీరు 2003 నుంచి ఇళ్ల చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఖలీల్ ఇప్పటి వరకు సుమారు వంద దొంగతనాలు చేశాడు.  

    ఇతన్ని గతంలో హైదరాబాద్,  సైబారాబాద్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఖలీల్‌పై నల్లకుంట పోలీసులు సీడీసీ(సిటీ డోసియర్ క్రిమినల్)ను తెరిచారు. జైలుకు వెళ్లి వచ్చిన ఖలీల్.. సయ్యద్ మజీద్‌తో కలిసి ఛాదర్‌ఘాట్, మదన్నపేట్, ఛత్రినాక, ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ పోలీసు స్టేషన్ల పరిధుల్లో చోరీలకు పాల్పడ్డారు. ఖలీల్‌పై ముషీరాబాద్, ఉప్పల్, షాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్లలో నాన్‌బెయిల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

    మజీద్‌ను కూడా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇదిలా ఉండగా, వీరిద్దరూ కలిసి శనివారం ఉదయం కారు (ఏపీ21ఎజీ-0492)లో మెహిదీపట్నం వెళ్తుండగా వాహన తనిఖీలు చేపట్టిన ఆసిఫ్‌నగర్ పోలీసులు ఆపారు.  అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇద్దరూ ఘరానా దొంగలని తేలింది. చోరీ చేసిన సొత్తును పాతబస్తీకి చెందిన మహ్మద్ మజర్‌ఖాన్, షేక్‌మహ్మద్‌లు విక్రయిస్తున్నట్టు నిందితులు వెల్లడించారు.

    దీంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి.. మొత్తం రూ.17 లక్షల విలువ చేసే 60 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ నాగరాజు, ఆసిఫ్‌నగర్  ఏసీపీ శ్రీనివాస్, ఆసిఫ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ జె.నర్సయ్య, డీఐ రఘునాథ్ పాల్గొన్నారు.  
     
    చోరీ సొత్తు కొంటే జైలుకే.....


    దొంగల వద్ద నుంచి నగలు కోనుగోలు చేసిన వారు కూడా నేరస్తులే అవుతారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. దొంగల నుంచి ఎవరూ నగలు కొనుగోలు చేయకపోతే చోరీలు తగ్గుతాయన్నారు. గత ఆరు నెలల్లో దొంగల నుంచి ఆభరణాలు కొనుగోలు చేసిన 21 మందిని అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement