టిక్‌టాక్‌ మాయ.. ఉద్యోగం గోవిందా! | Employees Negligence on Duty Tik Tok Videos Posting in Social Media | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ మాయ.. ఉద్యోగం గోవిందా!

Published Mon, Aug 5 2019 9:29 AM | Last Updated on Thu, Aug 8 2019 12:23 PM

Employees Negligence on Duty Tik Tok Videos Posting in Social Media - Sakshi

వైరల్‌గా మారిన ఒడిశా ఆస్పత్రి నర్సుల వీడియో

బొల్లారం: ఆధునిక ప్రపంచం చేతిలో ఇమిడిపోవడంతో యువత మైమరచిపోతున్నారు. ఏం చేస్తున్నారో తెలియకుండానే హద్దుమీరుతున్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండడంతో అందరికీ ‘టిక్‌టాక్‌’ వీడియోలకు బానిసలైపోతున్నారు. సమయం దొరికితే చాలు టిక్‌ టాక్‌ వీడియోలు చూడడం.. లేదా అందులోని వీడియోలను చూస్తూ అనుకరించడం, పాటలు పాడడం వీడియోలు తీస్తూ పోస్టు చేయడం మితిమీరి పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల వారు టిక్‌టాక్‌ మోజులో పడిపోతున్నారు. ఈ పోస్టులకు వచ్చే లైక్‌లు, కామెంట్స్‌ మోజులో పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఎక్కువ లైక్‌లు, కామెంట్‌లు కోసం సాహసాలు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న క్రమంలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ విష సంస్కృతి ఇప్పుడు ఉద్యోగులకు సైతం సోకడంతో వారూ విధి నిర్వహణ మరిచిపోయి వీడియోలు చేసేస్తున్నారు. ఇటీవల కొంతమంది ఉద్యోగులు కార్యాలయాల్లో వీడియోలు చిత్రీకరించి టిక్‌ టాక్‌లో పోస్టులు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వారి ఉద్యోగాలకు పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వాటిలో వచ్చుకు కొన్ని.. 

 మనవడితో కలిసి వృద్ధురాలు ఇలా..
నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ విద్యార్థులు ఆస్పత్రిలోనే టిక్‌టాక్‌ వీడియోలు చేసి పోస్టు చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వారిని విధుల నుంచి తొలగించారు. ఇక్కడ సరదా కాస్తా నిర్లక్ష్యంగా మారి ఉపాధికే ఎసరు వచ్చింది.  
విశాఖపట్నంలో శక్తి టీం విధులు నిర్వహిస్తూనే టిక్‌ టాక్‌ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీటిని వీక్షించిన యాజమాన్యం వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
బిహార్‌లో ఓ యువకుడు మిత్రులతో కలిసి వరదలో దూకుతూ టిక్‌ టాక్‌ వీడియో చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు వరద తాకిడికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  
తమిళనాడులో ఓ మహిళ తన భర్త టిక్‌ టాక్‌లు చేయడానికి అంగీకరించడం లేదని ఆత్మహత్యకు పాల్పడింది.

మితిమీరితే ప్రమాదమే..  
సామాజిక మాధ్యమాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటి వరకు ఫేస్‌బుక్‌లో లీనమైన యువత కికీ చాలెంజ్‌ను పట్టుకున్నారు. నేడు పబ్జి, హలో, టిక్‌ టాక్‌లతో హల్‌చల్‌ చేస్తున్నారు. వీటిని ఆనందం పొందేందుకు కొంతమేర ఉపయోగిస్తే ఫర్వాలేదు గానీ మితిమీరితే  ఇబ్బందేనని మానసిక వైద్యనిపుణులు, పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు వీడియోలు చిత్రీకరిస్తూ లైకులు, కామెంట్ల కోసం టిక్‌టాక్‌లో పోస్టు చేస్తున్నారు. ఇలా వీడియోల చిత్రీకరణ మోజులో పడితే కెరీర్‌ చెడిపోతుందని, కామెంట్లలో తేడా వస్తే గొడవలు, దాడులు సైతం జరుగుతున్నాయంటున్నారు. కొన్ని సందర్భాల్లో విచక్షణ కోల్పోయి విధి నిర్వహణలో ఉన్నా అన్నీ మరిచిపోయి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి భర్తకు తెలియకుండా టిక్‌ టాక్‌లు చేయడం మూలంగా భార్య, భర్తల మధ్య వివాదాలు పొడచూపుతున్నాయి. అవి విడాకుల దాకా తీసుకెళుతున్నాయి. కొంత మంది యువకులు పాటలకు తమ డ్యాన్సులు చేసేందుకు తమ కుటుంబ సభ్యులను సైతం భాగస్వామ్యుల్ని చేస్తున్నారు. ఈ వీడియోలు చూసిన వారు పెడుతున్న కామెంట్లకు అనుబంధాల గోడలు బీటలు వారుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి వాటితో కుటుంబాల్లో సైతం పొరపొచ్చాలు వస్తాయని, వీటికి దూరంగా ఉండడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.  

హద్దు దాటితే ప్రమాదం
ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి. తనకు కేటాయించిన విధులపైనే దృష్టి పెట్టాలి. విధుల్లో ఉండి వీడియోలు చిత్రీకరించడం, చూడడం చేయకూడదు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి. చరవాణిని దేనికోసం వాడుతున్నారు.. ఏవైనా ఉపయోగం లేని సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారా.. అనే కోణంలో పరీక్షించాలి. ఒక వేళ ఉపయోగించినట్లు తేలితే వాటికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీటి వినియోగం సరదాగా మొదలై, ఒక్కోసారి వ్యసనంగా మారవచ్చు. ఇది మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది.     – పి. మధుకర్‌స్వామి, సీఐ, కార్ఖానా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement