కొలిక్కిరాని విద్యుత్ ఉద్యోగుల విభజన
న్యాయస్థానం సూచన మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ
ఎవరి వాదన వారిదే-భేటీలో పరిష్కారం కాని విభజన సమస్య
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం కొలిక్కి రాలేదు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నాయి. న్యాయస్థానం సూచన మేరకు విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఇందులో రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఎవరి వాదనకు వారు కట్టుబడ్డారు. భేటీ అనంతరం ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతో విద్యుత్ ఉద్యోగుల విభజనపై చర్చించానని, పరిష్కారం లభించలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీ స్థానికత ఆధారంగా చేయాలని కోరుతోందని, ఇందుకు ఏపీ అంగీకరించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిన 1,253మంది విద్యుత్ ఉద్యోగులు రెండు నెలల నుంచి జీతాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు.
రాష్ట్రవిభజన చట్టంలో ఎక్కడా ఏకపక్షంగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీకి ఆస్కారం కల్పించలేదని, చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలు ఏ ప్రాంతం లో ఉన్నా ఏడాదిపాటు ఇరు రాష్ట్రాలు వాటి సేవలను పొందాలని ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలో విభజన చట్టంలో ఎక్కడా పొందుపరచలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీతోపాటు తెలంగాణ తొలగించిన విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీ జనాభా ప్రాతిపదికన షీలాబిడే కమిటీ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రానికి తెలియజేసినట్లు సీఎస్
పేర్కొన్నారు.