చేవెళ్ల రూరల్: ‘మా దేశాల్లో కన్నా ఇక్కడ వ్యవసాయ రంగం ముందంజలో ఉందని, సేద్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం భేషుగ్గా ఉంది’ అని కెన్యా, మలావా దేశాలకు చెందిన వ్యవసాయాధికారుల బృందం కితాబునిచ్చింది. నగరంలోని మేనేజ్ సంస్థలో శిక్షణ నిమిత్తం వచ్చిన కెన్యా, మలావా దేశాలకు చెందిన 30 మంది వ్యవసాయాధికారుల బృందం మంగళవారం మండలంలోని తంగడపల్లి, కుమ్మెర గ్రామాలను సందర్శించింది. ‘ఆత్మ’ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను గురించి తెలుసుకుంది.
ముందుగా మండలంలోని తంగడపల్లిలో బృందం సభ్యులు రైతు బాపిరాజు వేసిన మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం తోటను పరిశీలించారు. ఈ సాగుకు సంబంధించిన వివరాలను ‘ఆత్మ’ పీడీ వెంకయ్యనాయుడు వివరించారు. అనంతరం వారు రైతులతో మాట్లాడారు. ముందుగా మల్బరీ తోట పెంపకం కోసం వేసే నర్సరీని పరిశీలించారు. ఎన్ని రోజులుగా తోట వేస్తున్నారు.
మార్కెటింగ్ ఎలా ఉంటుందని రైతును అడిగి తెలుసుకున్నారు. తోటను 90 రోజుల క్రితం వేసినట్లు వారికి ఆయన వివరించారు. ఇదే రైతు సాగు చేసిన అరటి తోటను కూడా బృందం సభ్యులు పరిశీలించారు. తమ దేశంలోనూ సెరికల్చర్ సాగు ఉంది కాని తక్కువ సంఖ్యలో ఉందని తెలిపారు. అనంతరం కుమ్మెరలో శ్రీ వరి సాగు, పందుల బెడద నివారణకు ఉపయోగిస్తున్న సోలార్ ‘అరుపుల యంత్రా’న్ని వారు పరిశీలించారు. అనంతరం చేవెళ్లలోని విద్యావనరుల కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న శిక్షణ, సబ్సిడీలపై ఫొటో ప్రజెంటేషన్‌ను తిలకించారు.
ఈ సందర్బంగా ఇక్కడ వ్యవసాయానికి మంచి ప్రాధాన్యం ఉందని చెప్పారు. తమ దేశాల్లో వ్యవసాయం చేస్తున్నా అక్కడ ఇంతగా ప్రాధాన్యత లేదన్నారు. ఇక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకే వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్ వ్యవ సాయాధికారి దేవ్‌కుమార్, ‘ఆత్మ’ టెక్నికల్ అధికారి ఆర్. లక్ష్మణ్‌రావు, టెక్నికల్ ఏఓ వీరస్వామి, సెరికల్చర్ ఎస్‌ఓ యాదగిరి, టెక్నికల్ అధికారులు నారాయణ, ప్రకాశ్, ఏఓ భారతి, ఏఈఓ రాఘవేందర్, మేనేజ్ డెరైక్టర్ చారి, ‘ఆత్మ’ చైర్మన్ ఎన్ను నర్సింహారెడ్డి, ఆదర్శ రైతు వీరేశం, రైతులు పాల్గొన్నారు.
సేద్యానికి ప్రోత్సాహం బాగుంది
Published Wed, Sep 3 2014 5:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement