ముగిసిన లాటరీ ప్రక్రియ
- రాత్రి 12 గంటల వరకు పూర్తయిన 142 టెండర్లు
- నలుగురు మహిళలకు దక్కిన షాపులు
- పది మంది విద్యార్థులకు కూడా..
ఖమ్మం క్రైం: మద్యం షాపుల టెండర్ల డ్రా ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసింది. ఉదయం 10.30 గంటలకు సీక్వెల్ ఫంక్షన్ హల్‌లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ టెండరు బాక్స్‌ల సీళ్లను అందరి సమక్షంలో తెరిచారు. అనంతరం సింగిల్ దరఖాస్తుదారులకు మొదటగా షాపులను కేటాయించారు. కొత్తగూడెం(లక్ష్మిదేవిపల్లి) షాపును భూక్యా సురేష్‌కుమార్‌కు, భద్రాచలంలోని షాపు నంబరు 2 గోపాలం నరసింహమూర్తి, షాపు నంబరు 4 కోడే విజయ, షాపు నంబరు 9 కాడబోయిన వెంకటేశ్వర్లుకు కేటాయిస్తు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సమక్షంలో పత్రాలు అందజేశారు.
అనంతరం డీఆర్‌వో శ్రీనివాస్, ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ కె. మహేష్‌బాబు, ఈఎస్‌లు గణేష్, నరసింహరెడ్డి, ఏఈఎస్ ప్రీతమ్, సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు లాటరీల ప్రక్రియ కొనసాగింది. ప్రతి షాపునకు డ్రా తీసేటప్పడు నంబర్లను దరఖాస్తుదారులకు చూపించారు. సీక్వెల్ ఫంక్షన్ హల్ ఆవరణం దరఖాస్తుదారుతో కోలాహలంగా మారింది. డీఎస్పీ బాలకిషన్‌రావు ఆధ్వర్యంలో సివిల్, ఎక్సైజ్ పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఎప్పటికప్పడు పరిస్థితిని పర్యవేక్షించారు. ఒన్‌టౌన్ సీఐ రమణమూర్తి, ట్రాఫిక్ సీఐ రామోజీ రమేష్, ఎస్‌ఐలు కరుణాకర్, భానుప్రకాష్, లక్ష్మినారాయణ, ట్రాఫిక్ ఎస్‌ఐ గోపి, రాజా తదితరులు బందోబస్తు నిర్వహించారు.
నలుగురు మహిళలను దక్కిన షాపులు...
ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని ఖమ్మం బైపాస్ రోడ్డులోని రాపర్తినగర్ షాపు (నంబర్ 4) నగరానికి చెందిన దమ్మాలపాటి చైతన్య అనే మహిళకు దక్కింది. వైరా 11వ వార్డులోని షాపు (నంబర్ 1) వైరా సంతబజారుకు చెందిన చేబ్రోలు సుజాతకు దక్కింది. ఇల్లెందు 11వ వార్డులోని షాపు (నంబర్-5) ఇల్లెందుకు చెందిన కొండపల్లి మణి అనే మహిళకు దక్కింది. భద్రాచలంలోని 13వ వార్డులోగల షాపు (నంబర్-4) సింగిల్ దరఖాస్తులో భద్రాచలానికి చెందిన కోడే విజయకు దక్కింది. కాగా, జిల్లాలోని 142 షాపుల్లో ఒక్కో షాపునకు 8 నుంచి 10 మంది మహిళలు పోటీపడ్డారు.
విద్యావంతులే అధికం..
మద్యం షాపు టెండర్లలో ఈసారి విద్యావంతులు అధికంగా పాల్గొన్నారు. సుమారు 600 మంది పీజీ, బీఈడి, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనడం విశేషం. ఖమ్మంలోని ఓ విద్యాసంస్థల యజమానికి సైతం షాపు దిక్కింది. అదేవిధంగా నలుగురు లెక్చరర్లు, పది మంది విద్యార్థులకు, 20 మంది రైతులకు కూడా షాపులు దక్కాయి. గిరిజనులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ 10 మందికి మాత్రమే షాపులు దక్కినట్లు తెలుస్తోంది.
ఏజెన్సీ షాపుల కేటాయింపుపై కోర్టుకు వెళ్తాం..
ఏజెన్సీ ఏరియాలోని మద్యం షాపుల కేటాయింపులపై కోర్టుకు వెళ్తానని భద్రాచలానికి చెందిన కాంట్రాక్టర్ బుడిగం శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలిపారు. ఏజెన్సీ షాపుల విషయంలో అధికారులు స్పష్టమైన సమాచారం తెలపకపోవడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడిందని, షాపులకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. డ్రా తీసే కేంద్రం వద్ద కొంతసేపు నిరసన తెలిపారు. డీసీని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో గంటపాటు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయారు.