♦ 12,264 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ
♦ యూనివర్సిటీ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ
♦ ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతమే
♦ ఎంపీసీ కోటా ఫార్మా సీట్ల భర్తీ 4.9 శాతమే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. తుది దశ కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపు శనివారం నాటితో పూర్తయింది. ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మాడీ కేటగిరీలో 77.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ మూడు కేటగిరీల్లో 317 కాలేజీల్లో 70,427 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా.. 54,784 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నాటితో పూర్తి కావడంతో మూడు కేటగిరీల్లో 15,643 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇందులో ఇంజనీరింగ్ కేటగిరీలో 12,264 సీట్లు ఖాళీగా ఉండగా.. బీ ఫార్మసీలో 2,925 సీట్లు, ఫార్మాడీలో 454 సీట్లు మిగిలాయి.
2,015 మందికి దక్కని సీట్లు..
తుది దశ కౌన్సెలింగ్‌లో మొత్తంగా 1,06,200 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోగా 65,745 మంది విద్యార్థులు మాత్రమే అర్హులుగా తేలారు. వీరిలో తొలి దశలో 63,588 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా, తుది దశలో 38,661 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తం 54,784 సీట్లు భర్తీ కాగా.. 2,015 మంది విద్యార్థులకు సీట్లు అలాట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క సీటు కూడా అలాట్ కాకపోగా.. 76 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కోటాలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ కాగా.. 187 ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఫార్మాసీ కాలేజీలు వెలవెల..
ఈ ఏడాది ఎంపీసీ కోటా విద్యార్థులు ఫార్మసీ కోర్సులపై అనాసక్తి చూపారు. ఎంపీసీ కోటాలో 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు ఉండగా.. కేవలం 24 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 113 ప్రైవేటు కాలేజీల్లో 2,997 సీట్లు ఉండగా.. వీటిలో 128 సీట్లు మాత్రమే అభ్యర్థులు దక్కించుకున్నారు. ఫలితంగా 2,869 సీట్లు మిగిలిపోయాయి. అలాగే ఎంపీసీ కోటాలో ఫార్మాడీ కేటగిరీలో 51 ప్రైవేటు కాలేజీల్లో 503 సీట్లు ఉండగా.. వీటిలో 49 మందికి మాత్రమే సీట్లు కేటాయించారు. దాంతో 454 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.
29లోగా రిపోర్ట్ చేయాలి..
సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ పద్ధతిలో లేదా నగదు రూపంలో నిర్దేశిత బ్యాంకులో చలానా ద్వారా ఫీజు చెల్లించాలి. అనంతరం చలానా నంబర్ ఆధారంగా వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ నింపాలి. విద్యార్థులు ఈ నెల 28లోగా ఈ పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసి.. 29లోగా కాలేజీలో రిపోర్టు చేయాలని ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలి పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే అభ్యర్థులు ఈ నెల 27లోగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని హెల్ప్‌లైన్ సెంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది.