
ఇంజినీర్ టు ఎమ్మెల్యే
- శంకర్‌నాయక్ ప్రస్థానం
- సిట్టింగ్ ఎమ్మెల్యే కవితపై విజయం
- ఓడిన చోటే గెలుపుబాట
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : మానుకోట నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు కవితపై టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు శంకర్‌నాయక్ 9,602 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో ఓటమిపాలైన శంకర్‌నాయక్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు గెలుపు ప్రసాదించారు. జిల్లా కేంద్రంలోని ఏనుమాముల మార్కెట్ గోడౌనులో శుక్రవారం సాధారణ ఎన్నికల ఓట్లను లెక్కించారు. అనంతరం అధికారులు ఫలితాలను ప్రకటించారు.
మానుకోట అసెంబ్లీకి మొత్తం 12మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మెత్తం 2,16,685 ఓటర్లు ఉండగా 1,74,136 మంది (80.38శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2009లో మూడో స్థానంలో...
2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీచేసిన శంకర్‌నాయక్ 20 వేల పైచిలుకు ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత 15,367 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 1989 నుంచి ప్రస్తుత ఎన్నికల వరకు ఒకసారి గెలిచిన అభ్యర్థి మళ్లీ ఇక్కడ గెలవకపోవడం గమనార్హం.
1989లో సీపీఐ అభ్యర్థి బండి పుల్లయ్య.. కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994లో బండి పుల్లయ్య గెలుపొందగా, 1999లో శ్రీరాం భద్రయ్య(టీడీపీ), 2004లో వేం నరేందర్‌రెడ్డి(టీడీపీ), 2009లో మాలోతు కవిత(కాంగ్రెస్) విజ యం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బానోతు శంకర్‌నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి కవితపై గెలుపొందారు.
పీఆర్పీని వీడి.. టీఆర్‌ఎస్‌లో చేరి..
తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామ శివారు బాలాజీనగర్ తండాకు చెందిన బానోతు శంకర్‌నాయక్ బీటెక్ పూర్తిచేసి ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేశారు. 2009లో పీఆర్పీలో చేరి మానుకోట ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. అదే సంవత్సరం టీఆర్‌ఎస్‌లో చేరి పార్టీ రాష్ట్రకమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా, పినపాక, భద్రాచలం ఎన్నికల పరిశీలకుడిగా, మానుకోట పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు ముందు మానుకోటలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడం శంకర్‌నాయక్ గెలుపునకు దోహదపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాం గ్రెస్ ఇక్కడ సత్తా చాటినా సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. శంకర్‌నాయక్ గెలుపుతో నియోజకవర్గ పరిధిలోని టీఆర్‌ఎస్ నాయకులు ఆనందంలో మునిగారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.