కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనం ఎట్టకేలకు పూర్తయింది. రూ 2.63 కోట్ల వ్యయంతో 2016లో అగ్రిమెంట్ అయిన ఈ భవనంలో ఆరు తరగతి గదులు, ఐదు ల్యాబ్‌లు, ప్రిన్సిపాల్ గది, ఆఫీస్ గది, స్టాప్‌రూంలు నిర్మించారు. సరిపడా ల్యాబ్‌లు లేకపోవడం, వివిధ సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులు లేక కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. వారం రోజుల్లో నూతన భవనం ప్రారంభం కానుండడంతో కొంత మేర ఊరట కలుగనుంది.
క్లాస్ రూంలు దూర విద్యా కేంద్రం భవనంలోనే..
కాకతీయ యూనివర్సిటీలో దూర విద్యాకేంద్రంలోని అకాడమిక్ బ్లాక్‌లో మహిళా ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు. నాలుగు బ్రాంచీలు సీఎస్‌ఈ, ఐటీ, ఈఈఈ, ఈసీఈ ఉన్నాయి. ఆ నాలుగు బ్రాంచ్‌ల్లో సుమారు 1000 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరికి కనీసం 16 తరగతి గదులు అవసరం ఉంది. అయితే 15 గదుల్లో కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా మరికొన్ని ల్యాబ్‌ల కూడా అవసరం ఉంది.
ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రాక్టికల్స్ ల్యాబ్‌లకోసం ఇప్పటికే క్యాంపస్‌లోని బయోకెమిస్ట్రీలోని ల్యాబ్‌లను వినియోగించుకుంటున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ భవనం వారికి పూర్తిస్థాయిలో సరి పోదు. అందువల్ల దూర విద్యా కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అకాడమిక్ బ్లాక్‌లోనే విద్యార్థినులకు తరగతి గదులను అలాగే వినియోగించుకుంటూ నూతన భవనంలో అని గదులన్నింటిని ల్యాబ్‌లుగా వినియోగించుకోవాలనేది సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల యోచిస్తున్నారు.
ఇంజనీరింగ్ కళాశాల పూర్తిస్థాయిలో ఒకే చోట నిర్వహించాలంటే ఈ భవనం పక్కనే మరో భవనం నిర్మిస్తే సాధ్యమవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ కళాశాల భవనం చుట్టూ ప్రహరీని కూడా నిర్మించలేదు. కొన్ని నిధులు వెచ్చించి ప్రహరీని నిర్మించాలనేది కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ భవనం ప్రారంభోత్సవంతో కొంతమేర మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులకు ల్యాబ్‌ల సౌకర్యం పెరిగి ఎంతో ఉపయోగపడబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment