కేయూలో అక్రమాలు..!    | Irregularities In KU | Sakshi
Sakshi News home page

కేయూలో అక్రమాలు..!   

Published Sat, Aug 25 2018 2:40 PM | Last Updated on Tue, Aug 28 2018 2:46 PM

Irregularities In KU - Sakshi

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో పలు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిబంధనలకు విరుద్ధంగా వీసీ, రిజిస్ట్రార్‌ల అప్రూవల్‌ లేకుండా వివిధ పద్దుల కింద ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం ఇటీవల సంబంధిత యూనివర్సిటీ అధికారులతోపాటు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దృష్టికి వెళ్లింది. దీంతో సదరు ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నుంచి ఇటీవలనే యూనివర్సిటీ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద ఖర్చుచేసిన వాటిల్లో బిల్లులకు సంబంధించిన లెక్కల వివరాలు, ఓచర్లు, ఇతర డాక్యుమెంట్లు తమకు సమర్పించాలని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ ఇటీవల ప్రస్తుత డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మనోహర్‌ను ఆదేశిం చారు. గత ఆర్థిక సంవత్సరంలో కేయూ అడ్మిషన్ల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ రవీందర్‌ ఉద్యోగ విరమణ సైతం పొందాడు. ఆయన హయాంలో చేసిన ఖర్చులు, బిల్లుల వివరాలు, వాటిలో లోపాలను నివేదిక రూపంలో ప్రస్తుత డైరెక్టర్‌ టి.మనోహర్‌ రిజిస్ట్రార్‌కు నివేదించినట్లు తెలిసింది.

ప్రధానంగా కేయూలో రూ.20వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తే తొలుత వీసీ, రిజిస్ట్రార్‌ల అప్రూవల్‌ తీసుకోవాల్సిందే. అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో రూ.20వేలకు మించి ఖర్చుచేసినా అప్రూవల్‌ తీసుకోలేదనేది Ððవెల్లడైంది. స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్, నాన్‌ టీచింగ్, టీచింగ్‌ రెమ్యునరేషన్, హైర్‌చార్జెస్‌ వెహికల్స్, సీహెచ్‌డీ అడ్మిషన్స్‌ ప్రాసెసింగ్‌ టూ డీన్స్‌ కేయూ, కేయూ పీజీసెట్‌–2017, ఎంఫిల్, పీహెచ్‌డీ, జనరల్‌ లేబర్స్, క్యాజువల్‌ వేజెస్, ఫీజురిఫండ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ, మిస్లీనియస్, సానిటరీ, ప్రింటింగ్, అలవెన్సెస్, డైరెక్టర్‌ అండ్‌ జేడీల రెమ్యునరేషన్‌ కింద వ్యయం చేశారు. ఇందులో ఏమైనా లోపాలున్నాయా అనే కోణంలో విచారించాల్సి ఉంటుంది.

కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లు బిల్లులు ఉన్నప్పటికీ ఆ కంప్యూటర్లు అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో లేవనే ఆరోపణలున్నాయి. అలాగే స్టాక్‌ ఎంట్రీ రిజిస్టర్‌ మేయింటనెన్స్‌ చేయలేదని, ఎక్కువశాతం బిల్లులు సంతకం లేకుండానే పాసయ్యాయని తెలుస్తోంది. అప్పటి డైరెక్టర్‌ ఒక్కరే అవకతకవలకు పాల్పడ్డారా లేక అందులో మరో జాయింట్‌ డైరెక్టర్‌ ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. అప్పటి రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తేనే అసలు విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశాలున్నాయి. డైరెక్టర్‌ సంతకం లేకుండా బిల్లులు ఎలా పాస్‌అవుతాయనేది కూడా చర్చగాఉంది. 

ముగ్గురితో విచారణ కమిటీ..  

కాకతీయ యూనివర్సిటీ డైరెక్టరేట్‌లో 2017–18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అవకతవకల ఆరోపణలపై సమగ్ర విచారణకు కమిటీని నియమిస్తూ శుక్రవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ ఉత్తర్వులు జారీచేశారు. కమిటీలో చైర్మన్‌గా కేయూ సీడీసీ డీన్‌ కామర్స్‌విభాగం ప్రొఫెసర్‌ సీహెచ్‌.రాజేశం, సభ్యులుగా  కేయూ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ప్రభావతి, ప్రిన్సిపాల్‌ కార్యాలయం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కోలా శంకర్‌ను నియమించారు. సాధ్యమైనంత త్వరగా నివేదక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement