ఈ చదువులు ‘కొన’లేం! | Engineering Colleges Collecting Extra Fee For Attendance | Sakshi
Sakshi News home page

ఈ చదువులు ‘కొన’లేం!

Published Thu, Aug 22 2019 11:00 AM | Last Updated on Sat, Aug 31 2019 12:16 PM

Engineering Colleges Collecting Extra Fee For Attendance - Sakshi

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న అదనపు ఫీజులకు అడ్డుకట్ట వేయాలంటే విద్యార్థులకు అందుబాటులో వర్సిటీ అధికారుల ఫోన్‌ నంబర్లు, వాట్సాప్‌ నంబర్లు ఉంచాలి. మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, వర్సిటీలో ఫిర్యాదుల పెట్టెను అందుబాటులోకి తీసుకు రావాలి. దీంతో పాటు ఫిర్యాదు చేసిన విద్యార్థుల పేర్లను బయట పెట్టవద్దనే అభిప్రాయాలను పలువురు విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి,సిటీబ్యూరో: పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కాలేజీ చదువులు భారమయ్యాయి. ఆయా కళాశాలలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఎఫ్‌ఆర్‌సీ) నిబంధనల మేరకు కాకుండా విద్యార్ధుల నుంచి అదనపు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఎంసెంట్‌ కౌన్సెలింగ్‌కు ముందు విద్యార్థుల తల్లిదండ్రులకు అరచేతిలో వైకుంఠం చూపించి, టీఎఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులకు అదనంగా ఒక్క రూపాయి తీసుకోబోమని నమ్మించి.. తమ కళాశాలలో అన్ని వసతులతో పాటు, క్యాంపస్‌ ఇంటర్వ్యూలు అధికంగా ఉంటాయని వల వేస్తున్నారు. కౌన్సెలింగ్‌ ముగిసి కాలేజీలో చేరాక ఇంజనీరింగ్‌ కళాశాలలు తమ అసలు రంగు బయటపెడుతున్నాయి. ల్యాబ్‌ ఫీజు, లైబ్రరీ ఫీజు, యూనివర్సిటీ ఫీజు, స్కాలర్‌షిప్‌ అప్లికేషన్‌ ఫీజు, ప్లేస్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఫీజు, స్పోర్ట్స్‌ ఫీజు.. ఇలా వివిధ పేర్లతో విద్యార్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. దీనివల్ల చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు వారి తల్లిందడ్రులపై మోయలేని భారం పడుతోంది. ఒక్కసారి కళాశాలలో చేరా ఇష్టం ఉన్నా లేకపోయినా యాజమాన్యాలు అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి. అదనపు ఫీజులు కట్టలేక చేరిన కళాశాలను వదిలి వేరే కళాశాలకు మార్పు చేయించుకోవాలనుకున్నా సవాలక్ష కొర్రీలు ఉండడంతో గత్యంతరం లేక అదే కళాశాలల్లో అదనపు భారం మోస్తూ చదువాల్సి వస్తోంది. 

ఫీజుల నియంత్రణ టీఎఎఫ్‌ఆర్‌సీదే..
ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాధికారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఎఫ్‌ఆర్‌సీ)దేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ ప్రతి మూడేళ్లకు ఓసారి ఫీజులను ఖరారు చేస్తుంది. గతంలో కమిటీ నిర్ణయించిన ధరలను సవాల్‌ చేస్తూ చాలా కళాశాలలు కోర్టులను ఆశ్రయించాయి.
దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఫీజుల పెంపు విషయం పూర్తిగా టీఎఎఫ్‌ఆర్‌సీదేనని తేల్చడంతో కళాశాలలు తప్పని పరిస్థితుల్లో కమిటీ నిబంధనలను పాటిస్తున్నాయి. కానీ రూటు మార్చి అదనపు దోపిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఆదేశాల మేరకు ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫీజు రూ.లక్ష అనుకుంటే, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా రూ.35 వేలు చెల్లిస్తుంది. మిగతా రూ.65 వేలు కట్టడానికి విద్యార్థి తల్లిదండ్రులు ముందే ఒప్పుకుంటారు. దాంతో ఎన్ని ఇబ్బందులు పడైనా చెల్లిస్తారు. కానీ చాలా కళాశాలల యాజమాన్యాలు జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నాయి. 

కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ
ప్రైవేటు, అనుబంధ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఉంటుంది. అనుబంధ కళాశాలల్లో మౌలిక వసతులు ఏ మేరకు కల్పిస్తున్నారనే దాన్ని వర్సిటీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ 80 శాతానికి పైగా కళాశాలలకు నిబంధనల ప్రకారం విద్యార్థులకు మౌలిక వసతులను
కల్పించడం లేదనే విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ వీటిపై చర్యలు తీసుకోవడం లేదు. మొక్కుబడిగా నిజ నిర్థారణ కమిటీ పర్యటన మినహా అనుబంధ కళాశాలల్లో వర్సిటీ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement