సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను పక్కనబెట్టిందని, రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అనుమతించి తమకు న్యాయం చేయాలని జేఎన్టీయూహెచ్ గుర్తింపు దక్కని కాలేజీలు సుప్రీంకోర్టుకు మొరపెట్టుకున్నాయి. 20 ఏళ్ల నుంచి నడుస్తున్న కాలేజీలకు కూడా ఈసారి అనుమతులు ఇవ్వలేదని, తమను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చాయి. ఈ మేరకు అవి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కళాశాలల తరఫున న్యాయవాదులు గోపాల్ సుబ్రమణ్యం, కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ‘దాదాపు 20 ఏళ్ల నుంచి ఏఐసీటీఈ అనుమతులు, వర్సిటీ గుర్తింపున్న కాలేజీలను కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి తొల గించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమకు కావాల్సిన కళాశాలలను ఎంచుకుని, మిగతా వాటిని పక్కనబెట్టినట్లు స్పష్టమవుతోంది. అందువల్ల మాకు న్యాయం జరిగేలా మరో కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించండి’ అని కాలేజీల యాజమాన్యాలు వాదించాయి. టీ సర్కార్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘వెబ్ కౌన్సెలింగ్ గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ ఉత్తర్వులను పరిశీలించండి’ అని కోరారు.