సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వేర్వురుగా కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్‌లోని పోలవరం అతిథిగృహంలో సమావేశమైన ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు రోశయ్య, రిటైర్డు ఈఎన్‌సీలు బీఎస్‌ఎన్ రెడ్డి, రెహమాన్, రౌతు సత్యనారాయణ, హైడ్రాలజీ విభాగం సీఈ రత్నకుమార్ తదితరులు దీనిపై చర్చించారు. మరోవైపు జలసౌధలో తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ నేతృత్వంలో అధికారులు సమావేశం నిర్వహించారు. కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు మూడు ప్రతిపాదనలు చేయగా తెలంగాణ అధికారులు ఐదు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. వీటిపై జూలై 3వతేదీన హైదరాబాద్‌లో నిర్వహించే ఉమ్మడి సమావేశంలో చర్చించి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తరలించడంపై రెండు ప్రతిపాదనలను ఖరారు చేసి ఇద్దరు సీఎంలకు నివేదించాలని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన ప్రతిపాదన ఆధారంగా ప్రాథమిక నివేదికను జూలై 15 నాటికి సిద్ధం చేయనున్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించి తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలని శుక్రవారం జరిగిన భేటీలో ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్‌లు నిర్ణయించిన విషయం తెలిసిందే.
దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌పై దృష్టి..
దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గోదావరి జలాలను సాగర్, శ్రీశైలం జలాశయాలకు తరలించాలని రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు బలంగా ప్రతిపాదిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా 2007లో దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును చేపట్టారు. 2010లో ఈ పనులు ప్రారంభమైనా తర్వాత ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడు దుమ్మగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం ద్వారా అంటే దుమ్ముగూడెం నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను హాలియా వరకూ తరలించి అక్కడి నుంచి రెండు టీఎంసీలను నాగార్జునసాగర్‌లోకి, మరో రెండు టీఎంసీలను శ్రీశైలంలోకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి హాలియా వరకూ ఆరు చోట్ల 127 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 244 కి.మీ.ల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించాలి.
హాలియా నుంచి ఒక బ్రాంచ్ సాగర్‌కు, మరో బ్రాంచ్ శ్రీశైలానికి తరలించాలి. హాలియా నుంచి శ్రీశైలానికి తరలించాలంటే 50 కిమీల పొడవున కెనాల్, మరో 50 కిమీల టన్నెల్ తవ్వాలి. టన్నెల్ తవ్వడం రెండేళ్లలోపు పూర్తి చేయడం అసాధ్యమని, ఈ నేపథ్యంలో అదనంగా 70 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి వస్తుందని.. ఇది వ్యయంతో కూడుకున్నదని ప్రతిపాదిస్తున్నారు. రివర్సబుల్ టర్బైన్‌ల ద్వారా టెయిల్‌పాండ్ నుంచి సాగర్‌లోకి ఎత్తిపోయడం.. సాగర్ నుంచి శ్రీశైలంలోకి ఎత్తిపోయడం జలవిద్యుదుత్పత్తిపై దుష్ఫ్రభావం చూపుతుందని.. రోజుకు ఒక టీఎంసీకి మించి ఎత్తిపోయడం సాధ్యం కాదని.. ఈ నేపథ్యంలో రివర్సబుల్ టర్బైన్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడం చేపట్టరాదని ప్రతిపాదిస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు రోజుకు 4 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు రూ.75 వేల కోట్లకుపైగానే వ్యయం అవుతుందని.. 2,400 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ప్రాథమికంగా తేల్చారు.
పలు ప్రతిపాదనలు..
కృష్ణా బేసిన్‌కు గోదావరి వరద జలాల తరలింపుపై పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. జానంపేట నుంచి పైపులైన్ ద్వారా సాగర్, శ్రీశైలంలోకి గోదావరి జలాలను తరలించడం, రాంపూర్ నుంచి గోదావరి జలాలను ఆరు దశల్లో ఎత్తిపోయడం ద్వారా సాగర్, శ్రీశైలంకు తరలించడం, ఇచ్చంపల్లి నుంచి నేరుగా శ్రీశైలంలోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి నది ద్వారా సాగర్‌కు సరఫరా చేయడాన్ని ప్రతిపాదిస్తున్నారు.
పోలవరం ఎగువన నీటి లభ్యతపై అనుమానాలు
పోలవరం ప్రాజెక్టు ద్వారా 340 టీఎంసీలను నేరుగా వినియోగిస్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 60 టీఎంసీలను వినియోగించుకుంటే అది 400 టీఎంసీలకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పోలవరం ఎగువన అదనంగా 480 టీఎంసీల నీటి లభ్యత ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇరు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నీటి లభ్యత ఉన్నట్లు తేలితే పోలవరం నుంచి ఐదు దశల్లో నీటిని మున్నేరులోకి ఎత్తిపోసి గ్రావిటీపై పులిచింతలకు తరలించి.. పులిచింతల ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతం నుంచి టెయిల్‌పాండ్‌లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్‌ల ద్వారా సాగర్‌కు తరలించి.. సాగర్‌లో నీటిమట్టం 560 మీటర్లకు చేరుకున్న తర్వాత శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోని రివర్సబుల్ టర్బైన్‌ల ద్వారా నీటిని శ్రీశైలం జలాశయంలోకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌లలో జలవిద్యుదుత్పత్తి చేసే అవకాశం పూర్తిగా ఉండదు. పైగా ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే అధికంగా వ్యయం చేయాల్సి ఉంటుందని, నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సహేతుకం కాదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ జలవనరుల శాఖ ప్రతిపాదనలు ఇవీ..
1. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించడం
2. పోలవరం ఎగువ నుంచి మున్నేరులోకి గోదావరి జలాలను ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీపై పులిచింతలకు తరలించి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. సాగర్ నుంచి శ్రీశైలంలోకి తరలించడం.
3. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం ద్వారా శ్రీశైలం, సాగర్‌కు గోదావరి జలాలను ఎత్తిపోయడం
4. రాంపూర్ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలించడం
5. జానంపేట నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్‌కు తరలించడం
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రతిపాదనలు ఇవీ..
1. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేసి రెండు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోయడం.. మరో రెండు టీఎంసీలను హాలియా నుంచి శ్రీశైలం తరలించడం
2. రాంపూర్ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్‌లకు తరలించడం
3. పోలవరం ఎగువ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్‌లకు తరలించడం (ఈ ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు నీటి లభ్యత కూడా తక్కువనే అంశాన్ని ప్రస్తావించనున్నారు)
3న అధికారుల ఉమ్మడి సమావేశం
రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు, ఉమ్మడిగా ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ, రిటైర్డు ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు జూలై 3వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. రెండు ప్రతిపాదనలను ఖరారు చేసి వాటిపై అధ్యయనం అనంతరం ఇద్దరు సీఎంలకు ప్రాథమిక నివేదిక అందచేయాలని నిర్ణయించారు.
బడ్జెట్ సమావేశాలకు ముందే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే అంటే జూలై 10వతేదీకి ముందే గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించడంపై ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావులు తిరుపతి లేదా విశాఖపట్నంలలో సమావేశమై ఏకాభిప్రాయంతో ఒక ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయనున్నారు.
జూలై 15 నాటికి ప్రాథమిక నివేదిక..
ఇద్దరు ముఖ్యమంత్రులు ఆమోదించిన ప్రతిపాదన ఆధారంగా గోదావరి జలాల తరలింపుపై టోఫోగ్రాఫికల్, లేడార్ సర్వే చేసి టెక్నో ఫైనాన్షియల్ వయబులిటీ (సాంకేతిక, ఆర్థిక లాభసాటి)ని అధ్యయనం చేసి జూలై 15న నాటికి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా గోదావరి జలాల తరలింపుపై ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment