జలవివాదాలు : ‘కొలరాడో’ కొరడా! | AP And Telangana Decide To Divetion Godavari Water To Krishna | Sakshi
Sakshi News home page

జలవివాదాలు : ‘కొలరాడో’ కొరడా!

Published Tue, Jul 2 2019 4:07 AM | Last Updated on Tue, Jul 2 2019 4:07 AM

AP And Telangana Decide To Divetion Godavari Water To Krishna - Sakshi

విభజనానంతరం నేటికీ ఆంధ్ర–తెలంగాణాలను వేధిస్తున్న పలు అంశాలలో అత్యంత కీలకమైనది కృష్ణా–గోదావరి జలాల పంపిణీ సమస్య. ఆంధ్ర తెలంగాణలే కాకుండా రెంటికీ ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతోనూ ముడిపడి ఉన్న ఈ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల పరిష్కారం పరస్పరం జలరాశి ఉపయోగం దృష్ట్యా మాత్రమే జరగాలి. కానీ ఏలికల రాజకీయ స్వార్థప్రయోజనాలు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కాకుండా పాలకపక్షాల కచ్చిపోతు కుమ్ములాటలపై ఆధారపడు తున్నందున, ప్రజల మధ్య తగాదాలకు దారి తీస్తూ వచ్చాయి. కనీసం ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దీర్ఘకాల ప్రయోజనాల రక్షణ కోసం జలవివాదాల దశకు చరమగీతం పాడాలని కేసీఆర్, వైఎస్‌ జగన్‌ నిర్ణయించి ఒక పరిష్కారాన్ని సూచించే సంకల్పంతో ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులకు నివేదిక కోసం ఆదేశాలు జారీ చేశారు. 

కర్ణాటకకు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణానదిలోని అదనపు జలరాశిని ఉపయోగిం చుకోకపోతే అరుదైన ఈ జాతీయ సంపద మనకు దక్కదు. ఈ అదనపు జలాల సద్వినియోగానికి మనం పథకాలు వెంటనే వేసుకోవాలి. ఇది బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టంగా నిర్దేశించిన బాధ్యత. దాన్ని మనం నెర వేర్చాలి. ఈ అపరూప సంపదను మనం వినియోగించుకోని పక్షంలో అదనపు నదీజలాలను సముద్రంలో వదిలేసి వృధాపుచ్చుతున్నందుకు మొత్తం దేశమూ, ప్రజలూ మన రాష్ట్రాన్ని నిందిస్తారు. 
– తెలుగుగంగ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్న సుప్రసిద్ధ ఇంజనీర్‌.. కె. రామకృష్ణయ్య హెచ్చరిక (1985)

ఆంధ్రప్రదేశ్‌కు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర పాలకులు దిగు వన ఉన్న పూర్వపు ఆంధ్రప్రదేశ్‌ అయిదేళ్లనాడు రెండుగా చీలకముందు కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో పేచీకోరు రాజకీయాలకు పాల్పడ్డవారేనని మరిచిపోరాదు. బహుశా అందుకే అని ఉంటాడు ఆరుద్ర – ‘ఓట్లు అడుక్కునే రాజకీయులకే గానీ ప్రజలకు ప్రాంతీయ విభేదాలు ఉండవు’ అని! ఈ మాట ఎంత నిజమో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఏలికలు ఏళ్లూ, పూళ్లూగా నిరూపిస్తూనే వచ్చారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అర్ధంతర విభజన ఫలితంగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలకు నేటి  సీఎంలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ పాత గాయాల్ని, పాత కథల్ని పాతిపెట్టి ప్రజా సంక్షేమాన్ని ఆశించి ఉభయ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న పెక్కు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే రీతిలో ఒక చరిత్రాత్మక నిర్ణయానికి వచ్చారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, సమస్యల పరిష్కారం దిశగా వీరు ముందడుగు వేయడం బహుధా ప్రశంసనీయం. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్స్‌లో విభజనానంతరం పరిష్కరించవలసిన పెక్కు అంశాల్లో ఒక ప్రధానమైన అంశం, కృష్ణా–గోదావరి జలాల పంపిణీ సమస్య. ఈ రెండు నదుల అవసరం ఒక్క ఆంధ్ర తెలంగాణలకే కాకుండా రెంటికీ ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకూ ఉంది. ఈ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల పరిష్కారం ఈ మూడు రాష్ట్రాల ప్రజల అవసరాల దృష్ట్యా పరస్పరం జలరాశి ఉపయోగం దృష్ట్యా మాత్రమే జరగాలి. కానీ ఏలి కల రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ప్రజల అవసరాలను ఆసరాగా చేసు కుని కాకుండా పాలకపక్షాల కచ్చిపోతు కుమ్ములాటలపై ఆధారపడు తున్నందున, మూడు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాలకు దారి తీస్తూ వచ్చాయి. కనీసం ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దీర్ఘకాల ప్రయోజనాల రక్షణ కోసం జలవివాదాల దశకు చరమగీతం పాడాలని కేసీఆర్, వైఎస్‌ జగన్‌ నిర్ణయించి మిగతా సమస్యలతోపాటు ఒక పరిష్కా రాన్ని సూచించే సంకల్పంతో ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులకు నివే దిక కోసం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు తొలి చర్యగా గోదావరి నుంచి కృష్ణానదిలోకి తెలంగాణ ప్రయోజనాలకోసం రోజుకు 4 శతకోటి ఘనపుటడుగుల నీరు (టీఎంసీ) విడుదల చేయాలని, ఇందులో సాగ ర్‌కు రెండు, శ్రీశైలానికి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రులు ఇరువురూ అంగీకరించి, దీనిపై 15 రోజులలోగా సాధికార నివేదికను అందించమని అధికారులను ఆదేశించారు. 

అంతకుముందు ‘ముక్కూ, ముఖం’ లేని విభజన పరిష్కారం ఫలి తంగా పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌ కింద 86 సంస్థలూ, 10వ షెడ్యూల్‌ కింద 107 సంస్థలనూ విభజించాల్సి వచ్చింది, కానీ పరి ష్కారం కోసం ముందస్తు ప్రణాళిక లేకుండానే వేసిన ముందడుగు కాస్తా ‘వెనకడుగు’గా ముగిసి ఐదేళ్ల వ్యవధి  ఒడిదుడుకుల అధ్యాయంగా ముగియవలసి వచ్చింది. బాబు–కేసీఆర్‌ల మధ్య ‘పాము– కప్ప’ల మధ్య చెలగాటాలతో ముగిసింది. కాగా, ఇప్పటి జగన్‌– కేసీఆర్‌ల మధ్య సఖ్యతా సేతువు నిర్మాణం ఉభయప్రాంతాల శ్రేయస్సుకు అవసరం. ఒకవైపున పాలకుల ఒత్తిళ్లను తట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలు జల వనరుల వినియోగంలో అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేక ఉత్త రాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రయోజనాలు కుంటుప డ్డాయి. బచావత్‌ ఖాయం చేసిన నీటి కేటాయింపును, సముద్రంలోకి వృథాగా పోయే అదనపు జలరాశి వినియోగానికి ఎక్కడికక్కడ నిర్ణీత ప్రదేశాలలో డ్యాములు, రిజర్వాయర్ల నిర్మాణాల అవసరాన్ని నొక్కిచె ప్పినా, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అక్కరకురాని ప్రతిపాదనలు చేసింది.

తెలుగు రాష్ట్రాల జలరాశి వినియోగానికి ఒక్క రాయలసీమకే గాకుండా తెలంగాణ, కోస్తాంధ్ర ప్రయోజనాలను సహితం కాపాడగల పెక్కు చిన్న చిన్న రిజర్వాయర్ల నిర్మాణాన్ని శ్రీరామకృష్ణయ్య ప్రతి పాదించారు గానీ వినే నాథుడు లేక మరుభూమిలో కురిసిన వర్షంలా అయిపోయింది. చివరికి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమస్య తలెత్తినప్పుడు రాష్ట్రవ్యాప్త పర్యటన జరిపిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ అంతిమ నివేదికలో ‘రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నా   యనీ, మూడు ప్రాంతాలలోని సమస్యలతోను, అభివృద్ధితోనూ పోల్చితే రాయలసీమ అన్ని ప్రాంతాలకన్నా వెనకబడి కుంటుతోంద’ని కూడా చెప్పింది. కర్ణాటక, మహారాష్ట్ర పాలకులు ఆ రెండు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు ఎగువన ఉన్నందున డ్యాముల నిర్మాణం కర్ణాటక పెంచగా, మహారాష్ట్ర పాలకులు బాబ్లీ డ్యామును మహారాష్ట్ర ప్రయో జనాలకు సరిపడా కుదించి తెలంగాణకు ప్రాణప్రదంగా ఉన్న శ్రీరాం  సాగర్‌ ప్రాజెక్టుకు, గోదావరి నీటి ప్రవాహానికి అడ్డు నిలిచారు.

నిజానికి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎగువన ఉన్న రాష్ట్రాలు దిగువన ఉన్న రాష్ట్రాలకు నదీ జలరాశి అందకుండా ఏ రూపంలోనూ అడ్డుకునే లేదా ప్రతిబంధకం కలిగించే చర్యలకు పాల్పడరాదని అంతర్జాతీయంగా చట్టాలు ఉన్నాయి. 1922 నాటి ‘కొలరాడో రివర్‌ కాంపాక్టు’ సంధి అమెరికా రాష్ట్రాలన్నింటికీ శిరోధార్యం, ఆదర్శం. ఇది కొలరాడో నదీ పరీవాహక ప్రాంతాన్ని ఎగువ భాగం (అప్పర్‌ డివిజన్‌) అనీ, దిగువ భాగం (కిందనున్న ప్రాంతాలు–లోయర్‌ డివిజన్‌) అనీ రెండు బేసి న్‌లుగా విభజించారు. ఎగువన ఉన్న నదీ ప్రాంత భాగంలో కొలరాడో, న్యూమెక్సికో, ఉటా, వోమింగ్‌ రాష్ట్రాలు, దిగువన ఉన్న రాష్ట్రాలు నెవాడా, అరిజోనా, కాలిఫోర్నియా పైనున్న రాష్ట్రాలు దిగువనున్న రాష్ట్రా లకు ప్రవహించే కొలరాడో నదీ జలాలను వరుసగా పదేళ్లపాటు 9.3 కిలోమీటర్ల పరిధి వరకూ నదీ జలరాశిని ఏనాడూ అడ్డుకోరాదని ఆ సంధి శాసించింది. అలా కొలరాడో నదీ జలరాశిని రెండువైపుల ఉన్న రాష్ట్రాలకు మధ్య సమంగా పంపిణీ చేశారు. ఇలాంటి ఒప్పందాలే హూవర్‌ డ్యామ్, పావెల్‌ డ్యామ్‌ ప్రాంతాలను శాసించాయి. కాగా, తుంగభద్రా ప్రాజెక్టు నదీజలాల నిర్వహణకు కర్ణాటక కేంద్రంగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం 1953లో హోస్పేట దగ్గర్లో  ఏర్ప ర్చిన తుంగభద్ర బోర్డును అక్కడినుంచి ఎత్తివేసేదాకా కర్ణాటక నాయ కులు నిద్రపోలేదు. 1985 నుంచీ పేచీకోరుగా మారింది ఎందుకు? కృష్ణాజలాల్లోని అదనపు నీటిని ఆంధ్రప్రదేశ్‌ వాడుకోకుండా నిరోధిం  చడానికే కర్ణాటక రాజకీయులు ఆ పన్నుగడ పన్నారు. 1951లో కృష్ణా– పెన్నార్‌ పథకం వస్తే రాయలసీమ భూముల దాహం తీరుతుందని ఆశించారు. కానీ అదీ సరిగా నెరవేరలేదు.

ఇటు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో భాగం కాబట్టి తెలంగాణ మెట్ట ప్రాంతాలకు కృష్ణా–గోదావరి జలాలు సేద్యయోగ్యం చేసి ఆ భూములు సస్యశ్యామలం కావడానికి తోడ్పడగలవు. తెలంగాణ ఎల్తైన పీఠభూమితో కూడిన ప్రాంతం కావటంవల్ల అక్కడి పంటలు ప్రధానంగా వర్షాధారంపై పండేవి కాకుండా చెరువులపై ఆధారపడే సాగుభూములు. అందువల్లనే కృష్ణా–గోదావరి జలాలు రెండింటిపైన ఎక్కువ భాగం ఆధారపడవలసి వస్తోంది. కనుకనే మనకు సేద్యధారలం దించి కరువు కాటకాలనుంచి తెలుగు భూముల్ని కృష్ణా–గోదావరులపై ఆనకట్టలు నిర్మించి తన సొంత బ్రిటిష్‌ పాలకుల నుంచి శిక్షలు అను భవించిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి జిల్లాలలో యావత్తు తెలుగు ప్రజలనుంచి అపారమైన ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు.

ఆయన రాజకీయవేత్త కాకపోతేనేమి–ముందుచూపున్న క్రాంతదర్శి. కనుకనే, మొత్తం దేశానికి విభిన్న కాలువల ద్వారా అన్ని రాష్ట్రాలకు ఏమూల నున్నా సేద్యధారలందించగల మహా రిజర్వాయర్‌ నిర్మాణాన్ని సహితం రూపకల్పన చేశాడు. బ్రహ్మపుత్రా నదికి, గోదావరి నదికి లంకె కుద ర్చాలని చూసిన రూపశిల్పి కాటన్‌. ఇదే ద్రష్టకూ ‘భ్రష్ట’కూ ఉన్న తేడా.  స్వార్థపరులే నేతలుగా చెలామణి అవుతున్నందుననే నదీ జల వ్యవ స్థలను తీర్చిదిద్ది సువ్యవస్థితంచేసి విస్తరింపజేయడంలో విఫలమ య్యారు. అందుకే బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో జలరాశిని అవసరాల మేరకు వాడుకోవచ్చునేగానీ, ఏ రాష్ట్రమూ దానిపై తన హక్కు ముద్రను గుద్ది దబాయింపులకు దిగరాదని చెప్పింది. అలాంటి దబాయింపులకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ వీలు కల్పించింది కాబట్టే ఇన్ని తగాదాలు, వివాదాలూనూ. అందుకే మహాకవి ఖలీల్‌ జీబ్రాన్‌ చెప్పినా, సినారె చెప్పినా నేడు మనం రుజువు చేస్తున్న సత్యం ఒక్కటే: ఇంతకూ ‘దేశ నాయకుడెవడు? ఎవడు వాడు?/ నేల దున్నని వాడు/ నేత నేయని వాడు/ రాళ్లు మోయనివాడు/ రంగు ఫిరాయించేవాడు’

abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement