నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలు, పంపిణీలో నష్టాలను అధిగమించేందుకు సమృద్ధిగా నిధులు మంజూరు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవడం ద్వారా జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యంత్రాంగం భావిస్తోంది. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజీజేవై)- సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాల (ఐపీడీఎస్) కింద కేంద్రం విడుదల చేస్తున్న రూ.43,033 కోట్లలో అధికశాతం నిధులను రాబట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
-సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజీజేవై)- సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాల (ఐపీడీఎస్) కింద నిధులు రాబట్టడంపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రె డ్డి, రామ్మోహన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, సంజీవరావు, ప్రకాశ్‌గౌడ్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, అరికెపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, కనకారెడ్డి, విద్యుత్‌శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ పాండ్యానాయక్, ఎస్‌ఈలు శ్రీరాములు, బాలకృష్ణ, రంగనాథ్ తదితరులు హాజరయ్యారు.
కరెంట్ కష్టాలను తొలగించేందుకు.. సరఫరా వ్యవస్థలో లోపాలను సవరించుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందని భావించిన ప్రజాప్రతినిధులు.. వచ్చే నెల 8న జరిగే సమావేశంలో పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని నిర్ణయించారు. ఒకే ఫీడర్‌లోని వ్యవసాయ, వ్యవసాయేతర లైన్లను విడదీయడమేకాకుండా.. 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాట్లు, విద్యుత్ లైన్ల విస్తర ణ, స్తంభాల పునరుద్ధరణకు ఈ పథకం కింద నిధులు రాబట్టాలని సమావేశం అభిప్రాయపడింది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కొత్త కనెక్షన్లు, సబ్సిడీపై ఎల్‌ఈడీ బల్బుల సరఫరాపై సమగ్ర ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక శాసనసభ్యులను సంప్రదించి వారంరోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్)లు రూపొందించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈలను విశ్వేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. ఈ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అంశంపై జూలై 8న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. తొలి ప్రతిపాదనలకు కేంద్రం ప్రాధాన్యతనిచ్చే అవకాశమున్నందున.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభ్యులకు సూచించారు.
నాణ్యమైన విద్యుత్‌కు భరోసా
Published Fri, Jun 26 2015 12:50 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement