
తెలంగాణ రాష్ట్ర ఖాతాకు అనుమతి
- ఆర్‌బీఐతో ఒప్పందానికి గవర్నర్ ఆదేశాలు
- జూన్ 2వ తేదీ నుంచి ఎస్‌బీహెచ్‌లో తెలంగాణ ప్రభుత్వ ఖాతా
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియూ (ఆర్‌బీఐ)లో తెలంగాణ రాష్ట్ర ఖాతా ఏర్పాటునకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అనుమతించారు. గవర్నర్ తరఫున తెలంగాణ ఖాతా ఏర్పాటుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి (బడ్జెట్ వ్యవహారాలు) ఆర్‌బీఐతో ఒప్పందం చేసుకుంటారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం జూన్ 2వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఆర్‌బీఐలో ఖాతాను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆర్‌బీఐతో ఒప్పందానంతరం ఈ ఖాతా ఏర్పాటుతో జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ సంచిత నిధి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో కొనసాగుతోంది. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో ఉన్న నగదును జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్)లో ఏర్పాటు కానుంది.