తొమ్మిదిన్నరేళ్ల అనుబంధం | ESL Narasimhan Relation With Telugu States | Sakshi
Sakshi News home page

తొమ్మిదిన్నరేళ్ల అనుబంధం

Published Mon, Sep 2 2019 2:03 AM | Last Updated on Mon, Sep 2 2019 4:54 AM

ESL Narasimhan Relation With Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గవర్నర్‌ అంటే రాజ్‌భవన్‌కే పరిమితమై ఏవో చిన్నా పెద్దా కార్యక్రమాల్లో కనబడతారనేది గతంలో మాట. కానీ తెలుగు రాష్ట్రాలకు సుదీర్ఘకాలంగా గవర్నర్‌గా ఉన్న ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నమైన వ్యక్తి. ఈయన పేరు వినని తెలుగు ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇంచార్జి గవర్నర్‌గా వచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి, తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా సేవలందించి, ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా.. ఇలా సుదీర్ఘకాలం ఆయన తెలుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అదనపు బాధ్యతలు ఇచ్చి గవర్నర్‌గా నియమించారు. అప్పటి నుంచి తొమ్మిదిన్నరేళ్లకు పైగా ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఆదివారం కేంద్రం ఆయన్ను గవర్నర్‌ బాధ్యతల నుంచి తప్పించి తమిళనాడుకు చెందిన డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను నియమించడంతో సుదీర్ఘకాలం పాటు సాగిన ఆయన గవర్నర్‌ ప్రస్థానం ముగిసింది. మొత్తంగా గవర్నర్‌గా 9 ఏళ్ల 8 నెలల 3 రోజుల పాటు ఈఎస్‌ఎల్‌ గవర్నర్‌గా పనిచేశారు. 

2009 డిసెంబర్‌ 29 నుంచి.. 
రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌ క్లిష్ట సమయంలో బాధ్యతలు స్వీకరించారు. 2009లో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9న చేసిన ప్రకటన, ఆ తర్వాత ఉపసంహరణతో తెలంగాణ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమించారు. సీనియర్‌ పోలీసు అధికారిగా పదవీవిరమణ పొందిన నరసింహన్‌ను నియమించడం అప్పట్లో సంచలనం అయింది. తెలంగాణ ఉద్యమం అదుపు తప్పకుండా ఉండేందుకే ఆయన్ను గవర్నర్‌గా నియమించారనే చర్చ జరిగింది. ఆ తర్వాత 2010 జనవరి 23న ఆంధ్రప్రదేశ్‌ పూర్తిస్థాయి గవర్నర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన గవర్నర్‌ హోదాలో తనదైన ముద్ర వేస్తూ పాలన సాగించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ, కొత్త రాష్ట్రం ఏర్పాటు, ఎన్నికల నిర్వహణ, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో విధులు, మళ్లీ తెలంగాణలో గవర్నర్‌గా పనిచేయడంలో ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. స్పష్టమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆకట్టుకున్నారు. 

ఐదుగురు సీఎంలతో ప్రమాణం 
సుదీర్ఘకాలం పాటు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ ఐదుగురు సీఎంలతో ప్రమాణం చేయించిన రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డితో, ఆ తర్వాత కేసీఆర్, చంద్రబాబులను, రెండోసారి కేసీఆర్‌తో, తొలిసారి జగన్‌మోహన్‌రెడ్డిలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఆయన ప్రమాణం చేయించారు. ఇక, మంత్రివర్గ విస్తరణల ద్వారా ఇరు రాష్ట్రాలకు మంత్రులను కూడా అదే స్థాయిలో ప్రమాణం చేయించిన ఘనతను దక్కించుకున్నారు. రాష్ట్రాల విభజన తర్వాత ఎదురైన సమస్యల పరిష్కారంలోనూ ఆయన చాలా సమన్వయంతో వ్యవహరించారు. సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో భేటీలు ఏర్పాటు చేయించడంతో పాటు విభజన సమస్యల పరిష్కారంలోనూ ఆయన చొరవ చూపారు. ఆ తర్వాత కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డిల నేతృత్వంలోని ప్రభుత్వాల మధ్య సమస్యల పరిష్కారంలోనూ నరసింహన్‌ దిశానిర్దేశం చేశారు. మొత్తానికి తొమ్మిదిన్నరేళ్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ రాష్ట్ర విభజనతో పాటు అనేక రాజకీయ పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచి ఆ జ్ఞాపకాలన్నింటినీ పదిలపరుచుకుని వెళుతున్నారు. 

పౌరసేవలపైనా శ్రద్ధ 
విద్య, ఆరోగ్యం అంటే ఆయనకు ప్రాణం. రాజ్‌భవన్‌ ఉద్యోగుల పిల్లల కోసం ఉన్న పాఠశాలకు నూతన భవనాలు నిర్మింపజేసి కార్పొరేట్‌సంస్థ తరహాలో దాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ పాఠశాలలో సీటంటే హాట్‌కేక్‌గా మారింది. సమయం దొరికినప్పుడల్లా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై నిక్కచ్చిగా మాట్లాడేవారు. ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయంగా కాకుండా సేవాదృక్పథంతో పనిచేయాలని చురకలంటించేవారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలిచ్చే సంస్థల్లా మిగిలిపోకుండా పరిశోధనాలయాలుగా రూపాంతరం చెందాలని సూచించేవారు. ఏ సమస్య వచ్చినా గాంధీ ఆసుపత్రికే వెళ్లేవారు. ఆయనకు దైవభక్తి ఎక్కువే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఖైరతాబాద్‌లోని ఆంజనేయ దేవాలయానికి వెళ్లేవారు. సంప్రదాయ వస్త్రధారణతో గుళ్లకు వెళ్లే నరసింహన్‌ స్వయంగా మంత్రోచ్ఛారణ చేసేవారు. రాజ్‌భవన్‌ను కూడా ఆయన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 

విమలానరసింహన్‌.. ది లేడీ గవర్నర్‌ 
నరసింహన్‌ రాష్ట్ర గవర్నర్‌గా ఎంత పరిచయమో ఆయన సతీమణి, విమలా నరసింహన్‌ కూడా అంతగానే సుపరిచితులు. చురుకైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న విమల కూడా తనదైన శైలిలో వ్యవహరించేవారు. రాజ్‌భవన్‌ సిబ్బంది పట్ల ఆమె వ్యవహరించిన తీరు, రాజ్‌భవన్‌కు వచ్చే వారితో మెలిగే తీరు, గవర్నర్‌తో కలిసి బయట కార్యక్రమాలకు హాజరయినప్పుడు ఆమె ఆహార్యం, అనేక అంశాలపై ఆమెకున్న అవగాహన లాంటివి లేడీ గవర్నర్‌గా ఆమెకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.

పని విషయంలో నర‘సింహ’మే! 
ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టిన సమయంలో రెండు ప్రాంతాల్లోనూ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ సమయంలో ఆయన చాలా నేర్పుగా వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహ ణ, ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రసంగ ప్రతులను చించి గవర్నర్‌ పైనే విసిరేశారు. అయినా నరసింహన్‌ ఎక్కడా తగ్గలేదు. ఉద్యమ సమయంలో శాంతిభద్రతలను సమన్వయం చేశారు. 2014 ఎన్నికల ముందు దాదాపు 3 నెలల  గవర్నర్‌ పాలనలోనూ తనదైన ముద్రను చూపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement