సాక్షి, హైదరాబాద్: ప్లాట్లు, భవనాలు, అపార్ట్‌మెంట్ల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు త్వరలోనే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఏర్పాటు కానుంది. కొత్త రియల్ ఎస్టేట్ చట్టంలోని మార్గదర్శకాల అమలుపై పర్యవేక్షణతోపాటు కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల బృందం ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లో రెరా అథారిటీల పనితీరును అధ్యయనం చేసిన నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. మహారాష్ట్రలో అమలు చేస్తున్న మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ సంస్థను ఏర్పా టు చేయాలని, రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంతో అది పనిచేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే రాష్ట్రంలో రెరా అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది.
కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం..
ప్లాట్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో కొత్త రియల్ ఎస్టేట్ చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో కీలకమైన స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా)ను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. తాజాగా రెరా ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది.
‘రెరా’లో రిజిస్ట్రేషన్ తర్వాతే..
ప్లాట్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లు తదితర అన్ని స్థిరాస్తి ప్రాజెక్టులను రియల్టర్లు తప్పనిసరిగా ‘రెరా’వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సంబంధిత స్థిరాస్తుల విక్రయానికి సంబంధించిన వ్యాపార ప్రకటనలు జారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి వివరాలను రెరాకు సమర్పించాలి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకపోతే.. సరైన కారణాలు చూపి రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపును కోరాల్సి ఉంటుంది. రెరా కింద ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి.. కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతారు. అదే విధంగా ఏజెంట్లు, కొనుగోలుదారులతో బిల్డర్లు, డెవలపర్లకు సమస్యలు ఏర్పడినా ఈ సంస్థకు ఫిర్యాదు చేసుకోవచ్చు. కొనుగోలుదారులు గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో.. జరిగిన ఆలస్యానికి సంబంధించిన వడ్డీని రాబట్టుకునేందుకు డెవలపర్లు నియంత్రణ సంస్థను ఆశ్రయించవచ్చు.
కొనుగోలుదారులకు భద్రత
- గడువులోగా స్థిరాస్తిని అప్పగించడంలో డెవలపర్ విఫలమైనా, ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనా కొనుగోలుదారులకు డబ్బులు తిరిగి ఇప్పించడంలో నియంత్రణ సంస్థ సహకరిస్తుంది.
- ఈ చట్టం ప్రకారం డెవలపర్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడినా, సస్పెన్షన్‌కు గురైనా, ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేసినా.. కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును రెరా తిరిగి ఇప్పించనుంది.
- స్థిరాస్తి ప్రాజెక్టుకు సంబంధిత శాఖలు జారీ చేసిన అనుమతులు (అప్రూవ్డ్ ప్లాన్), ఇతర వివరాలను నియంత్రణ సంస్థ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతుంది.
- విక్రయ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో దశల వారీగా పూర్తి చేయాల్సిన నిర్మాణ పనుల వివరాలను అందుబాటులో ఉంచుతుంది.
- డెవలపర్ ప్రాజెక్టు నిర్మాణంలో రియల్ ఎస్టేట్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయటపడితే కొనుగోలుదారులకు పరిహారం అందేలా చర్యలు చేపడతారు.
ఏజెంట్ల రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి
ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంటు కూడా తప్పనిసరిగా రెరా వద్ద తమ పేరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాతే స్థిరాస్తి లావాదేవీల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్లకు సంబంధించిన ఫీజులను కూడా నియంత్రణ సంస్థే ఖరారు చేస్తుంది. ఏజెంట్లు జరిపే లావాదేవీల్లో తప్పనిసరిగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుపర్చాల్సి ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment