బాజాప్తా అప్పు చేస్తం | etala rajender in assembly | Sakshi
Sakshi News home page

బాజాప్తా అప్పు చేస్తం

Published Wed, Nov 15 2017 2:25 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

etala rajender in assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మంగళవారం అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం బాజాప్తా అప్పు చేస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పగా అప్పుల్లోనే రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శించాయి. రాష్ట్ర అప్పులపై ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, సభ్యులు జీవన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు, రాష్ట్ర ప్రజల ఆర్ధిక పరిపుష్టికి అప్పులు చేయడం ఎంతైనా అవసరమన్నారు.

‘‘రాష్ట్రంలో తాగు, సాగు అవసరాలను తీర్చే ప్రాజెక్టులు కట్టాలన్నా, గతుకులులేని రోడ్లు నిర్మించాలన్నా, ఇళ్లు లేని వారికి ఇళ్లివ్వాలన్నా, పంటలకు విద్యుత్‌ అందించాలన్నా అప్పులు అవసరమే. రాష్ట్రం, ప్రజల అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నాం. బాజాప్తా అప్పు చేస్తం. అప్పు చేసే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం’’అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటివరకు ఉన్న అప్పు రూ. 1,35,554.03 కోట్లుగా ఉందన్నారు. అభివృద్ధి జరగకపోతే వందేళ్లయినా అవే కరువులు, ఆత్మహత్యలు, ఆకలిచావులు ఉంటాయి తప్ప ఏమీ జరగదన్నారు.

తెలంగాణ ప్రజలను దేశంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేస్తున్నామని, వడ్డీలు, అసలు చెల్లింపులు రాష్ట్ర రెవెన్యూ వసూళ్లకు మించడం లేదని ఈటల వెల్లడించారు. దేశ జీడీపీలో 41.11 శాతం మేర కేంద్రం అప్పులు చేసిందన్నారు. ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా అప్పులు అనివార్యమన్న ఈటల... ప్రపంచంలో ఎక్కువ అప్పులు చేసిన దేశాల్లో జపాన్, అమెరికా, ఫ్రాన్స్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న విమర్శ వంద శాతం తప్పని అన్నారు. గొల్ల కుర్మలకు గొర్లిస్తామంటే, ప్రజలకు తాగునీళ్లు, రైతులకు సాగునీరు ఇస్తామంటే మీరు అడ్డుపడతారా? అని విపక్షాలను ప్రశ్నించారు.

ఎఫ్‌ఆర్‌బీఎంతో సంబంధం లేకుండా అప్పులా?
మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని జానా... ఆగ్రహంగా లేచి ‘‘నేను చాలెంజ్‌ చేస్తున్నా. ఎఫ్‌ఆర్‌బీఎంతో సంబంధం లేకుండా ‘ఉదయ్‌’కింద అప్పులు తెచ్చారు. కాదేమో మంత్రిని సమాధానం చెప్పండి’’అని ప్రశ్నించారు. దీనిపై ఈటల సమాధానమిస్తూ గంట సమయమిస్తే అన్ని చర్చిద్దామని పేర్కొనగా...సీట్లో కూర్చున్న జానా ‘ఓకే అట్లే చర్చిద్దాం. మేము రెడీ’అని రుసరుసలాడారు. ఇదే సమయంలో మంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విసురుగా బయటకు వెళ్లిపోయారు.


గిమ్మిక్కులు చేసి మిగులు ఆదాయం చూపారు: జానా
ఈటల సమాధానంపై జానారెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘జపాన్, అమెరికా దేశాలు ఎక్కువ అప్పులు చేస్తున్నా వాటికి ప్రపంచాన్ని కొనగలిగేంత ఆస్తులున్నాయి. మనం చేసే అప్పులు రాష్ట్ర ఆస్తులు పెంచేలా ఉండాలి. వెనిజులా దేశంలో 93 శాతం చమురు నిక్షేపాలున్నాయి. సంక్షేమంలో గొప్పగా ఉన్న ఆ దేశం రెండేళ్లుగా అప్పులతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది’’అని చురకలంటించారు.

గతేడాది గిమ్మిక్కులు చేసి రాష్ట్ర ఆదాయాన్ని మిగులు ఆదాయంగా చూపిన ప్రభుత్వం మళ్లీ ప్రతిపక్షాలనే దబాయిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులతో వచ్చే మార్చి నాటికి అప్పులు రూ. 2.20 లక్షల కోట్లకు చేరతాయన్నారు. దీనిపై ఇప్పడు సమాధానం చెప్పకపోయినా బడ్జెట్‌ సందర్భంగా అయినా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. జానా వ్యాఖ్యలపై ఈటల స్పందిస్తూ రాష్ట్రం మిగులు రాష్ట్రమని కేంద్ర సంస్థలే చెప్పాయన్నారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే మిషన్‌ భగీరథకు రూ. 40 వేల కోట్లు, ఉదయ్‌ బాండ్‌లకు రూ. 8 వేల కోట్లు అప్పు తెచ్చామన్నారు. ‘‘నేను బక్క పేదోణ్ణి..నాకు వంద ప్రశ్నలు వేస్తరా?. బడ్జెట్‌ సందర్భంగా అన్నింటికీ సమాధానం చెబుతా’’అన్నారు.


దేశంలో అత్యధిక అప్పులు రాష్ట్రానివే
అంతకుముందు కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన మూడున్నరేళ్లలో అప్పుల భారం రెట్టింపైందన్నారు. జాతీయ స్థాయిలో అప్పుల పెరుగుదల 33 శాతంగా ఉంటే తెలంగాణలో 71 శాతానికి మించి ఉందన్నారు. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనేనన్నారు.

రాష్ట్ర తలసరి అప్పుల భారం రూ. 40 వేలుగా ఉందని, 2018 చివరి నాటికి పుట్టబోయే వారికి అది రెట్టింపు అవుతుందన్నారు. ప్రభుత్వం ఆర్భాటాలకు పోతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతోందని, రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోందన్నారు. బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారని, దేశంలోనే రాష్ట్రం అప్పుల్లో నంబర్‌ వన్‌గా ఉందని విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement