బడ్జెట్ పై మిశ్రమ స్పందన
సాక్షి, సంగారెడ్డి/నెట్‌వర్క్: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2016-17 వార్షిక బడ్జెట్‌పై అధికార పక్షం ప్రశంసించగా విపక్ష పార్టీల జిల్లా అధ్యక్షులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. బడ్జెట్‌పై వివిధ పార్టీల నేతల స్పందన వారి మాటల్లోనే.
చారిత్రాత్మకమైన బడ్జెట్
బంగారు తెలంగాణ నిర్మాణానికి అనుగుణంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చారిత్రాత్మకమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో అన్నిరంగాలకు ప్రాధాన్యత ఇచ్చి కేటాయింపులు జరిపారు. మునుపెన్నడూ లేనివిధంగా రూ.1.30 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేపెట్టడం గర్వం ఉంది. మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయలకు భారీగా నిధులు కేటాయించారు. వ్యవసాయం, సంక్షేమ రంగాలతోపాటు డబుల్‌బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణాలకు నిదులు కేటాయించారు. ఉత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టేలా చూసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాల.
- మురళీయాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
రైతు వ్యతిరేక బడ్జెట్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో అంకెల గారడీ మినహా ఏమీలేదు. వ్యవసాయం రంగానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి నిధులు సంతృప్తికరంగా లేదు. కేపీ టు పీజీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. అమవీరుల కుటుంబాలకు ఆదుకునే విషయమై స్పష్టత ఇవ్వలేదు. బడ్జెట్‌లో సంక్షేమరంగాన్ని విస్మరించి, సంక్షేమానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. - శ్రీధర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు
మహిళా, శిశు సంక్షేమాన్ని విస్మరించారు
బడ్జెట్‌లో మహిళా, శిశు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ మినహా ఏమీ లేదు. వ్యవసాయం, రైతు రుణమాఫీకి సంబంధించిన ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. మిషన్‌భ గీరథ, కాకతీయకు నిధులు భారీగా కేటాయించిన నిధులు ఎప్పటిలో ఖర్చు చేస్తారు అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. సంక్షేమ రంగాన్ని విస్మరించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు బడ్జెట్‌లో అన్యాయం జరిగింది. కరువు సహాయం గురించి బడ్జెట్‌లో ఏమాత్రం ప్రస్తావించలేదు. - సునీతారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు
ప్రజలను మభ్యపెట్టేలా ఉంది
టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేలా ఉంది. మిషన్ కాకతీయ, మిషన్‌భగరీథకు తప్ప ఇతర రంగాలకు కేటాయింపులు లేవు. లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయ రంగాన్ని బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారు. రుణమాఫీ విషయంలో స్పష్టత లోపించింది. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తగిన కేటాయింపులు జరపలేదు. సంక్షేమరంగానికి నామమాత్రం కేటాయింపులు జరిపారు. వివిధ పథకాల కింద కేంద్రం ఇచ్చే నిధుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. - కాసాల బుచ్చిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు
నిరాశ పరిచింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశపర్చింది. సంక్షేమం, వ్యవసాయరంగాలకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో నిధులు ప్రకటించలేదు. కేజీ టు పీజీ విద్య, జిల్లా కేంద్రాల్లో నిమ్స్ తరహా ఆసుపత్రులు, రైతుల ఆత్మహత్యల నివారణకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపుల జరపలేదు. మహిళా, శిశు సంక్షేమాన్ని విస్మరించారు. విత్తన చట్టం గురించి బడ్జెట్‌లో ప్రస్తావనలేదు. - ఏ.మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి
కేజీ టు పీజీ ఊసే లేదు
పేద మధ్య తరగతి ప్రజలను బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చింది. ప్రభుత్వం సంక్షేమ రంగానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌లో కేజీ టు పీజీ గురించి ఊసులేదు. రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్‌లు ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. దళితులకు భూమి పంపిణీకి సంబంధించి నిదులు కేటాయించలేదు. వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం విస్మరించింది. -మందపవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి
అనేక శాఖలను విస్మరించారు
రైతులను ప్రభుత్వం విస్మరించింది. మూడు జిల్లాలో ఎన్‌ఎస్‌ఎల్ ఫ్యాక్టరీలు అర్ధంతరంగా మూతపడటంతో రైతులు రోడ్డున పడ్డా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈసారి నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికిగాను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం శోచనీయం. బడ్జెట్‌లో అనేక శాఖలను విస్మరించిన ప్రభుత్వం మసిపూసి మారెడు కాయ చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికిగాను నిధుల కేటాయింపులు లేవు. ఎస్సీలు, మైనారిటీల రిజర్వేషన్ల పెంపుదల కేవలం హామీలకే పరిమితమైంది.
- టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి
ప్రజల ఆకాంక్షలేవీ?
బడ్జెట్‌లో ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించలేవు. రుణమాఫీని ఏకమొత్తంలో అమలు చేస్తామని చెప్పి మాట తప్పారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా మూడేళ్లలో కోటి ఎకరాలకు నీరందిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకు సాగడం లే దు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం తదితర రంగాలను నిర్లక్ష్యం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అంశంపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదు.
-బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు
బంగారు తెలంగాణను సాకారం చేసే బడ్జెట్
బంగారు తెలంగాణ కలలను సాకారం చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణను ముందుంచే విధంగా బడ్జెట్‌ను తయారు చేశారు. పేదల సంక్షేమానికి రూ. 13వేల కోట్ల పైచిలుకు కేటాయించడం అభినందనీయం. రైతుల కష్టాలను తీర్చేందుకే సాగునీటి రంగానికి రూ. 25వేల కోట్లు కేటాయించారు. ప్రభుత్వ వైద్యరంగంపై విశ్వాసం పెంచే విధంగా ఆ శాఖలో మెరుగైన వసతుల కల్పనకు రూ. 5,967 కోట్లు, విద్యారంగాభివృద్ధికి రూ. 10,738 కోట్లను కేటాయించారు. అదే విధంగా ఆసరా, కల్యాణలక్ష్మీ, డబుల్‌బెడ్‌రూం పథకాలతో దేశంలోనే ఉత్తమ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకుంటుంది. - మాదాసు శ్రీనివాస్,
టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు విద్యా రంగానికి అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. గత బడ్జెట్‌లో కేటాయించిన దాటికంటే 1.46శాతం తక్కువగా కేటాయించారు. కోటారి కమిషన్ నివేదిక ప్రకారం 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలి. -శ్రీకాంత్, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు
బడ్జెట్ కాపీలు దహనం
సంగారెడ్డి మున్సిపాలిటీ: బడ్జెట్‌లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత, కేటాయింపులు జరపలేదని ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ సాధన సంఘం నాయకులు మాణిక్యం అన్నారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి తగిన స్థాయిలో నిధులు కేటాయించలేదన్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్, బీసీ సబ్‌ప్లాన్ గురించి బడ్జెట్‌లో ప్రస్తావించకపోవటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు జయరాజు, రమేశ్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, మధు, చంద్రారెడ్డి, బస్రాజు తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీలకు పెంపు లేదు...
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటికీ ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. గతేడాది బడ్జెట్‌లో రూ. 238.19 కోట్లను కేటాయించారు. ఈ మొత్తంలో ఎటువంటి మార్పులు లేకుండా ప్రస్తుత 2016-17 బడ్జెట్‌లోనూ అంతే విదిల్చారు. వర్సిటీ అధికారులు దాదాపు రూ. 300 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం ఏటా దాదాపు రూ. 250 కోట్ల వరకు నిధులు అవసరం. వీటితోపాటు వాటర్ వర్క్స్, విద్యుత్‌కు మరో రూ. 20 కోట్లు ఖర్చవుతున్నాయి. ఇవన్నీగాక లాబ్ మెటీరియల్స్, స్టేషనరీ, సిస్టమ్స్ నిర్వహణ, భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం తదితర వాటికి అదనంగా నిధులు కావాలి. అంటే ఈ లెక్కన తాజా బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఉద్యోగులు వేతనాలకే నిధులు సరిపోవని స్పష్టంగా తెలుస్తోంది.